Israel: హమాస్‌తో యుద్ధమే.. అధికారికంగా ప్రకటించిన ఇజ్రాయెల్‌

మిలిటెంట్‌ సంస్థ హమాస్‌తో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి అక్కడి సెక్యూరిటీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Published : 08 Oct 2023 21:10 IST

టెల్‌అవీవ్‌: హమాస్‌ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇజ్రాయెల్‌ (Israel Hamas conflict) దద్దరిల్లింది. ప్రతిగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ కూడా వైమానిక దాడులకు దిగింది. ఈ భీకర దాడుల్లో ఇరువైపులా కలిపి ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో మూడు, నాలుగు వేల మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి తాజాగా అక్కడి సెక్యూరిటీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

‘గాజా నుంచి అక్టోబర్‌ 7న ఉదయం 6గంటలకు ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులతో యుద్ధం మొదలైంది’ అని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అవసరమైన సైనిక కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ విషయాన్ని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అక్కడి సెక్యూరిటీ కేబినెట్‌ ఇందుకు ఆమోద ముద్ర వేసింది.

ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు దిగిన పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌.. ఒకేసారి వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించింది. దీంతోపాటు సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్‌ విరుచుకుపడటంతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ.. డజన్లకొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఓవైపు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతోపాటు గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతిదాడులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇరువైపుల వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని