Israel: మాది ఘోర తప్పిదం.. అంగీకరించిన ఇజ్రాయెల్‌.. అగ్రరాజ్యం ఆగ్రహం!

Israel: ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో గాజా పౌరులకు మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం, బ్రిటన్‌.. వివరణ కోరాయి.

Updated : 03 Apr 2024 10:01 IST

గాజా: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ (Israel) జరుపుతున్న యుద్ధంపై ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో.. మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించడంతో వివాదం ముదిరింది. ఈ ఘటనను దుందుడుకు చర్యగా అభివర్ణిస్తుస్తూ ఇజ్రాయెల్‌ను పలు దేశాలు వివరణ కోరాయి.

ఇజ్రాయెల్‌ (Israel) జరిపిన గగనతల దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గాజా (Gaza)కు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న ఈ సంస్థ.. తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మృతుల్లో ముగ్గురు బ్రిటన్‌వాసులతోపాటు ఆస్ట్రేలియా, పోలండ్‌, అమెరికా, కెనడాకు చెందిన వారున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

లక్ష్యాన్ని గుర్తించడంలో పొరబడ్డాం..

ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు. స్వతంత్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యాన్ని గుర్తించడంలో పొరబడ్డామని ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జీ హలేవీ తెలిపారు. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

ఇజ్రాయెల్‌ తగిన చర్యలు తీసుకోవట్లేదు..

ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల ప్రాణాలను రక్షించడానికి ఇజ్రాయెల్‌ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ‘‘వారు యుద్ధం మధ్యలో ఆకలితో ఉన్న పౌరులకు ఆహారం అందిస్తున్నారు. ధైర్యంగా, నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. వారి మృతి తీరని లోటు. సహాయక సిబ్బంది వాహనాలపై వైమానిక దాడి ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ తెలిపింది. అది వేగంగా జరగాలి. దాని ఫలితాలను బహిరంగపరచాలి. ఈ ఘటన ఒక్కటే కాదు. ఈ యుద్ధంలో ఎంతో మంది సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాలో మానవతా సాయం క్లిష్టంగా మారింది. సామాన్యులకు సేవలందిస్తున్న వారి రక్షణకు ఇజ్రాయెల్‌ తగిన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం’’ అని బైడెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

సాయం కొనసాగిస్తాం..

గాజాలో ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా పౌరులకు కావాల్సిన సాయం అందించేందుకు చేస్తున్న కృషిని అమెరికా కొనసాగిస్తుందని బైడెన్ తెలిపారు. అందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. వారికి సాయం చేరేలా వెసులుబాటు కల్పించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. కైరోలో ఓ బృందం దీనిపైనే పనిచేస్తోందని వెల్లడించారు.

పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి..

మరోవైపు మృతుల్లో బ్రిటన్‌ పౌరులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) స్పందించారు. దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇజ్రాయెల్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా దాడిపై వీలైనంత వేగంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. నెతన్యాహుతో సునాక్‌ దీనిపై ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు లండన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారికి సమన్లు కూడా జారీ చేశారు. దాడిపై వివరణ కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని