Donald Trump: దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్‌

Donald Trump| శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో దోషిగా తేలిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 02 Jun 2024 22:08 IST

వాషింగ్టన్‌: శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో దోషిగా తేలిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన కేసులు, వాటిపై పలుదఫాలుగా జరిగిన నేర విచారణ తనకంటే, తన భార్య మెలానియాపైనే ఎక్కువ ప్రభావం చూపించాయన్నారు. అక్కడి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విచారణ చివరి రోజు తన సంతానంలో ముగ్గురు మాత్రమే కోర్టుకు హాజరై, నైతిక మద్దతు ఇచ్చారని చెప్పారు. భార్య మెలానియా మాత్రం రాలేదని తెలిపారు.  

‘‘నన్ను దోషిగా నిర్ధరించడాన్ని మెలానియా జీర్ణించుకోవడం కొద్దిగా కష్టమే. నాపై అభియోగాలు రుజువుకావడం కుటుంబ సభ్యులపై పలు రకాలుగా ప్రభావం చూపించాయి. నాకంటే వారే ఎక్కువగా బాధపడుతున్నారు. నేను దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడకపోయి ఉంటుంది. అందుకే ఆమె రాలేదేమో!’’ అని వ్యాఖ్యానించిన ట్రంప్‌.. తన సతీమణిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెలానియా నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అధికార, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పక్కనే ఉండేవారు. అధ్యక్ష పదవి కోల్పోయిన తర్వాత ఆయన నిర్వహించిన ఏ ర్యాలీలోనూ ఆమె కనిపించలేదు. ఇతర కార్యక్రమాల్లోనూ కనిపించడం అరుదే.

అక్రమ సంబంధం కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైనట్లు న్యూయార్క్‌ కోర్టు ఇటీవల తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయన్ను దోషిగా నిర్ధరించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని