Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

Jaahnavi Kandula: కారుతో ఢీకొట్టి జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.

Updated : 22 Feb 2024 09:40 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం బుధవారం ప్రకటించింది. సీనియర్‌ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

మరోవైపు జాహ్నవి (Jaahnavi Kandula) మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ తెలిపారు. ఈ నేపథ్యంలో అడెరెర్‌పై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపొద్దనే నిర్ణయంపై ఉండబోదని వివరించారు. అయితే, అడెరెర్‌ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికే అతనిపై సస్పెన్షన్‌ వేటుపడ్డ విషయం తెలిసిందే. అతనిపై చర్యల తుది విచారణాంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి (Jaahnavi Kandula) 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్‌ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్‌ చేసింది. దీంతో అతణ్ని సస్పెండ్‌ చేశారు. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని