Jaishankar: ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు: పాక్‌పై జైశంకర్‌ మండిపాటు

పాకిస్థాన్‌, చైనా వ్యవహరిస్తోన్న తీరును అంతర్జాతీయ వేదికపై విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) ఖండించారు. 

Published : 23 Mar 2024 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలే పరిస్థితిలో భారత్‌ లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar)అన్నారు. ప్రస్తుతం సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్‌ ఏషియన్ స్టడీస్‌లో ప్రసంగించారు.  ఈసందర్భంగా పాకిస్థాన్‌, చైనా చర్యలను ఖండించారు. 

‘‘ఒక పరిశ్రమ స్థాయిలో పాకిస్థాన్‌(Pakistan) ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్‌ లేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలి. దానినుంచి తప్పించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేకపోగా.. తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుంది. అదీ కాకపోతే, కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుంది. పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేం’’ అని జైశంకర్ స్పష్టంచేశారు. 

ఈసందర్భంగా చైనా (China) దుందుడుకు ప్రవర్తన పైనా స్పందించారు. చైనా-భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌(అరుణాచల్‌ ప్రదేశ్‌)కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించారు. అయితే.. అది తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని బీజింగ్‌ ఇటీవల నోరు పారేసుకుంది. ఈ వ్యవహారంపై జైంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఆ వాదన హాస్యాస్పదమని, అరుణాచల్ ప్రదేశ్‌ మా సహజ భూభాగం’’ అని తేల్చి చెప్పారు. 

ఇదిలాఉంటే.. చైనా వితండవాదనపై అగ్రరాజ్యం అమెరికా, భారత్‌కు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. డ్రాగన్ ఆ వ్యాఖ్యలను ఖండించింది. తమ ఇరుదేశాల సరిహద్దు వివాదంతో వాషింగ్టన్‌కు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని