Japan Airlines: టోక్యో ఎయిర్‌ పోర్టులో రెండు విమానాలు ఢీ

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్‌ వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొంది.

Updated : 02 Jan 2024 16:48 IST

టోక్యో: జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌ 516 విమానం ప్రమాదానికి గురైంది. రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్‌ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. హొక్కైడో విమనాశ్రయం నుంచి ఇది బయల్దేరి వచ్చింది. 

ఈ ఘటనపై జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికారులు స్పందిస్తూ.. విమానం రన్‌వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొన్నట్లు భావిస్తున్నామని జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలియజేశారు. ఇప్పటికీ విమానం మంటలు అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది వరకు ఉన్నారని ఎన్‌హెచ్‌కే పేర్కొన్నట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. వీరందరినీ బయటకు చేర్చినట్లు తెలిపింది. ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియరాలేదు.

కనిపించని కోస్టుగార్డు సిబ్బంది ఆచూకీ

ప్రమాద సమయంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో ఒకరు బయటపడగా.. మరో ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదని ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ఒక్కసారిగా మంటలు తీవ్రం కావడంతో లోపలికి వెళ్లి వెతకడం విమానాశ్రయ సిబ్బందికి కూడా సాధ్యం కాలేదు. తాజా ఘటనతో హనేడా విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు 70కి పైగా అగ్నిమాపక శకటాలను మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనపై జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి..ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.

జపాన్‌లో ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడం గత మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1985లో జేఏఎల్‌ జంబో జెట్‌ విమానం టోక్యో నుంచి ఒకాసా నగరానికి వెళ్తుండగా.. గున్మా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో 520 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు వరుస భూకంపాలతో జపాన్‌ చిగురుటాకులా వణికిపోతున్న వేళ.. విమాన ప్రమాదం చోటు చేసుకోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు