Japan: జపాన్‌లో 62కు చేరిన మృతుల సంఖ్య.. పొంచి ఉన్న మరో ఉపద్రవం

Japan: జపాన్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంపం తాకిడికి ఇప్పటి వరకు 62 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Updated : 03 Jan 2024 10:36 IST

టోక్యో: జపాన్‌లో భూకంపం (Japan Earthquake) ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 62 మంది మృతులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు.

జపాన్‌లో జనవరి 1న రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి (Japan Earthquake) ఇషికావా ప్రిఫెక్చర్‌ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా నోటో ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమైంది. వేలాది భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనల్లో 62 మంది మృతి చెందడంతోపాటు మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 32 వేల మంది నిరాశ్రయులుగా మారారని.. వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. తీర ప్రాంతంలోని సుజు పట్టణంలో దాదాపు 90 శాతం ఇళ్లు ధ్వంసమైనట్లు మేయర్‌ మషురో ఇజుమియా తెలిపారు. 

ఇప్పటికీ చాలా మంది సాయం కోసం వేచిచూస్తున్నారని స్వయంగా జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా బుధవారం తెలిపారు. వారందరినీ ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానిక యంత్రాంగాలన్నీ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. మరోవైపు, జపాన్‌లో బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని