Japan: ఈదురు గాలులతో జపాన్‌ చంద్రయానం చివరి నిమిషంలో వాయిదా..!

జపాన్‌ చేపట్టిన చంద్రయానం తాజాగా వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటించలేదు. ప్రయోగానికి 27 నిమిషాల ముందు తీవ్రమైన గాలు వీయడంతో వాయిదా వేశారు.  

Updated : 28 Aug 2023 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టాలన్న జపాన్‌  (Japan) కల సాకారమయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. తాజాగా ఆ దేశం నేడు నిర్వహించాల్సి చంద్రయానం వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌-2ఏ పేరిట రాకెట్‌ను జపాన్‌ సిద్ధం చేసింది. కానీ, ప్రయోగ కేంద్రం వద్ద గాలులు తీవ్రంగా వీయడం, ఉపరితల వాతావరణంలో కూడా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో లాంచ్‌కు 27 నిమిషాల ముందు యాత్రను వాయిదా వేశారు. ఇప్పటికే ఈ రకం రాకెట్‌పై చేసిన ప్రయోగాలు 98 శాతం విజయవంతం అయ్యాయి.

‘‘గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ముందుగా హెచ్చరించిన ప్రదేశాల్లోనే కాకుండా వేరే చోట్ల కూడా రాకెట్‌ శకలాలు కూలే అవకాశం ఉంది’’ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ వెల్లడించారు. ఈ యాత్ర కోసం మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌తో కలిసి జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ పనిచేస్తోంది. ప్రయోగ కేంద్రం వద్ద 5,000-15,000 మీటర్ల ఎత్తులో గాలి వేగం గంటకు 108 కిలోమీటర్లుగా నమోదైంది. జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ (జేఏఎక్స్‌ఏ) సేఫ్టీ మేనేజర్‌ మిషియో కవాకమి వెల్లడించారు. జపాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు తుపాన్లు ఉండటం కూడా ప్రయోగాన్ని ప్రభావితం చేసింది. తదుపరి ప్రయోగ తేదీని నిర్ణయించలేదు. రీఫ్యూయలింగ్‌ వంటి కనీస చర్యలను చేపట్టాల్సి ఉండటంతో గురువారం వరకు దీనిని సిద్ధం చేసే పరిస్థితి లేదు. సెప్టెంబర్‌ 15 తర్వాతనే ప్రయోగ తేదీ ఉండవచ్చని భావిస్తున్నారు. 

మూన్‌ స్నైపర్‌ మిషన్‌..

ఈ రాకెట్‌లో జపాన్‌ ఏరోనాటిక్స్ ఎక్స్‌ప్లోరేషన్‌కు చెందిన స్లిమ్‌ (స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌)ను చంద్రుడిపైకి చేర్చనున్నారు. జనవరి-ఫిబ్రవరి మధ్యలో కక్ష్యను ఆధారంగా చేసుకొని స్లిమ్‌ చంద్రుడిపై ల్యాండ్‌ అయ్యేట్లు జేఏఎక్స్‌ఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. జాబిల్లిపై నిర్దేశించిన ప్రదేశానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్‌ అయ్యేట్లు స్లిమ్‌ను డిజైన్‌ చేశారు. దీనిలోనే జేఏఎక్స్‌ఏ, నాసా, ఈఎస్‌ఏ కలిసి మరో పరికరాన్ని కూడా అక్కడకు తీసుకెళ్లనున్నారు. తాజాగా సిద్ధం చేసిన హెచ్‌-2ఏ రాకెట్‌పై 46 ప్రయోగాలు చేపట్టగా.. 45 సఫలం అయ్యాయి. తాజాగా చేపట్టిన ప్రయోగం 47వది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని