Aukus: చైనాకు చేదు కబురు.. ఆకస్‌ కూటమిలోకి జపాన్‌..?

చైనా కట్టడికి అమెరికా మిత్రదేశాలు మరో కీలక చర్యను చేపట్టనున్నాయి. జపాన్‌ను తమ కూటిమిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 07 Apr 2024 11:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు జపాన్‌ కీలక అడుగు వేయనుందని నివేదికలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా నౌకాదళానికి కీలకమైన అణుశక్తి సబ్‌మెరైన్ల తయారీ ఒప్పందమైన ఆకస్‌(Aukus)ను విస్తరించి దానిలోకి జపాన్‌ను కూడా తీసుకొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఫైనాన్షిల్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. త్వరలోనే దీనిపై చర్చలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అమెరికానే ఈ దిశగా చర్యలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.  ఈ కూటమి కృత్రిమ మేధ, డ్రోన్లు, డీప్‌స్పేస్‌ రాడార్ల సాయంతో చైనాపై ఎల్లవేళలా నిఘా ఉంచే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది.   

ఆకస్‌ కూటమిలోని రక్షణ మంత్రులు సోమవారం బేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఒప్పందంలోని పిల్లర్‌-2ను బలోపేతం చేయడంపై ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని కింద సభ్యదేశాల్లో క్వాంటమ్‌కంప్యూటింగ్‌,  జలగర్భ, హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ-సైబర్‌ సాంకేతికను అభివృద్ధి చేయనున్నారు. ఇక ఈ ఒప్పందంలో మొదటి పిల్లర్‌ కింద ఆస్ట్రేలియాకు అణుశక్తి సబ్‌మెరైన్లు అందించనున్నారు. 

ఇక చైనాను కట్టడి చేయాలంటే టోక్యో ఈ కూటమిలోకి రావాలనే బలమైన వాదన ఉంది. అప్పుడే తైవాన్‌పై ఒక వేళ చైనా దాడి చేస్తే కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని జపాన్‌ మాజీ ప్రధాని టారో అసో పేర్కొన్నారు. 2023లో బ్రిటన్‌ ఫారెన్‌ అఫైర్స్ కమిటీ ఆకస్‌లోకి జపాన్‌, ద.కొరియాను తీసుకోవాలని సూచించింది. జోబైడెన్‌ సర్కారు ఆసియాలోని జపాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటుపై చైనా రుసరుసలాడుతోంది. ప్రాంతీయంగా ఆయుధ పోటీనిని ఇది ఎగదోస్తుందని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని