Literary Award: చాట్‌జీపీటీ సాయంతో నవల.. రచయిత్రికి దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం!

చాట్‌జీపీటీ సాయంతో రాసిన ఓ నవలకు జపాన్‌ అత్యున్నత సాహిత్య పురస్కారం (Akutagawa Prize) లభించింది.

Published : 24 Jan 2024 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రీ కుడాన్‌ (33) అనే జపాన్‌ నవలా రచయితను ఆ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం (Akutagawa Prize) వరించింది. ‘టోక్యో-టు డోజో-టు (Tokyo Sympathy Tower)’ పేరుతో రాసిన సైన్స్‌ ఫిక్షన్‌ నవలకు ఈ ఉత్తమ అవార్డు వచ్చింది. ఈ పుస్తకంపై న్యాయనిర్ణేతలు కూడా ప్రశంసలు గుప్పించారు. తాజాగా దీనిపై ఆ రచయిత్రి స్పందిస్తూ.. తన నవలలో కొంతమేరకు చాట్‌ జీపీటీ (ChatGPT)ని ఉపయోగించినట్లు అంగీకరించారు. దీంతో ఈ అంశం కాస్త చర్చనీయాంశమయ్యింది.

‘చాట్‌జీపీటీ వంటి కృత్రిమమేధను ఉపయోగించుకొని ఈ నవలను రాశా. ఈ పుస్తకంలో దాదాపు 5శాతం ఏఐ నుంచి నేరుగా సేకరించిందే. నా సృజనాత్మకతను మరింత వ్యక్తీకరించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలని భావిస్తున్నా’ అని రీ కుడాన్‌ పేర్కొన్నారు. భారీ జైలును సృష్టించే క్రమంలో ఓ ఆర్కిటెక్టుకు ఎదురైన సమస్యల చుట్టూ తిరిగే ఈ నవలపై మిశ్రమ స్పందన వస్తోంది.

కళాకారులు, రచయితలు కృత్రిమ మేధను ఉపయోగించే అంశం ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్‌ రచయిత్రే కాకుండా జర్మనీ కళాకారుడు ఏఐని వినియోగించి తీసిన ఓ ఫొటోగ్రఫీ ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకోవడం గతంలో వివాదాస్పదమైంది. నిర్వాహకులు ఆ కళాకారుడిపై తొలుత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. చివరకు అతడి వివరణతో వెనక్కి తగ్గారు. ఏఐపై చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే దరఖాస్తు చేసుకున్నానని చెప్పిన ఆయన చివరకు ఆ అవార్డును తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని