Iran vs Israel: రంగంలోకి అమెరికా.. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్

ఇజ్రాయెల్‌కు తాము అన్ని రకాలుగా అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌ డ్రోన్‌, బాలిస్టిక్‌ క్షిపణుల దాడుల వేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

Updated : 14 Apr 2024 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌(Iran)-ఇజ్రాయెల్‌ (Israel) మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తాజాగా ప్రకటించారు. ‘‘భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నేను నెతన్యాహుకు తెలిపాను. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. మేం ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నాం. ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు.  అంతకు ముందే.. ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడారు. దీంతోపాటు జీ7 దేశాధినేతలతో కూడా బైడెన్‌ సంభాషించనున్నారు. ఇరాన్‌ దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ నేతలతో తన బృంద సభ్యులు టచ్‌లో ఉంటారని పేర్కొన్నారు.

ఇరాన్‌ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్‌ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి.

తాజాగా ఇరాన్‌ దాడిపై ఐరాసలో ఆ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్‌ సయీద్‌ ఇర్వానీ మాట్లాడుతూ ‘‘అవసరమైన ప్రతిసారి మాకు ఉన్న ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటాం. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ఈ సారి స్పందన మరింత బలంగా ఉంటుంది’’ అని హెచ్చరించారు.

70కిపైగా డ్రోన్లను కూల్చేసిన అమెరికా..

అమెరికా దళాలు ఇరాన్‌ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్‌ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్‌ మొత్తం 100కుపైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని