Air Force One: అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లో వరుస చోరీలు.. దొంగలెవరో తెలుసా..?

ఎగిరే శ్వేతసౌధంగా ప్రసిద్ధి చెందిన అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’లోనే కొన్నేళ్లుగా దొంగతనాలు జరుగుతున్నాయి.

Updated : 01 Apr 2024 11:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత భద్రత మధ్య ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ’ (Air Force One) విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది.. హస్తలాఘవం ప్రదర్శిస్తున్న సదరు వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆంగ్లపత్రిక ‘పొలిటికో’ వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ ఆ దొంగలు ఎవరో తెలుసా.. అధ్యక్షుడి పర్యటనలో ఆయనతో వెళ్లే మీడియా కరస్పాండెంట్లు..!

అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటనల్లో భాగంగా కొందరు మీడియా కరస్పాండెంట్లను తనతోపాటు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో తీసుకెళతారు. ఈ సమయంలో సదరు సిబ్బంది ఆ విమానంలోని విస్కీ, వైన్‌ గ్లాస్‌లు.. ఇలా ఒకటేమిటీ శ్వేతసౌధం చిహ్నం ఉన్న వస్తువులను వారి బ్యాగ్‌ల్లో సర్దుకొంటున్నారు. ఆ తర్వాత విమానం దిగేస్తున్నారు. ఈ విషయాన్ని ది వైట్‌ హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్‌ (ఎన్‌బీసీ) ఇటీవలే తెలిపారు. ఇక ముందు అలాంటి చర్యలు మానుకోవాలని తోటి సభ్యులను ఆయన సున్నితంగా హెచ్చరించారు.

ఎయిర్‌ ఫోర్స్‌వన్‌లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసం అక్కడి వస్తువులను చాలా కాలంగా మీడియా సిబ్బంది తీసుకెళ్లేవారు. ఈ అంశాన్ని ఉద్దేశించి కెల్లీ మాట్లాడుతూ మీరు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణించారని ప్రజలు నమ్మాలంటే ఆ వస్తువులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఆ విమానంలో మీరు ఉన్న చిత్రాన్ని మా సిబ్బంది మీకు మెయిల్‌ చేస్తారని పేర్కొన్నారు.

చాలా ఏళ్లుగా ఇలానే..

గతంలో ఒక సారి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియా కరస్పాండెంట్లకు డిన్నర్‌ ఏర్పాటు చేశారు. దీనిలో బంగారం పూత పూసిన పింగాణీ ప్లేట్లను వాడారు. అనంతరం ఆండ్రూస్‌ జాయింట్‌ ఎయిర్‌ బేస్‌లో విమానం ఆగిన తర్వాత కొందరు కరస్పాండెంట్ల బ్యాక్‌ప్యాక్‌ల నుంచి పింగాణీ వస్తువుల చప్పుళ్లు వినిపించాయని ఓ ప్రముఖ పత్రిక ప్రతినిధే స్వయంగా తెలిపారు.

వస్తువులు వాపస్‌ చేసిన వ్యక్తి..

ఇటీవల ఫిబ్రవరి 5వ తేదీన శ్వేతసౌధం ట్రావెల్‌ ఆఫీస్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో కొంత సామగ్రి కనిపించడంలేదని గుర్తించింది. వీటిల్లో ఓ పిల్లోకేస్‌ కూడా ఉంది. దీంతో సిబ్బంది ఆ సమయంలో అధ్యక్షుడి పర్యటనకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఒక ఈమెయిల్‌ పంపారు. ఎవరి లగేజీలో అయినా పొరబాటున విమానంలోని వస్తువులు కలిసిపోతే.. వాటిని ఎవరికీ తెలియకుండా తిరిగి ఇచ్చేందుకు సాయం చేస్తామని దానిలో పేర్కొన్నారు. దీంతో ఒకరు ఆ పిల్లోకేస్‌ను సైలెంట్‌గా తీసుకెళ్లి పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని ఆండ్రూ జాక్సన్‌ విగ్రహం వద్ద సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై శ్వేతసౌధం అధికారులు మాట్లాడుతూ మీడియా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని.. ఆ తస్కరణలు ఆపటమే లక్ష్యమని వెల్లడించారు.

అది ఎగిరే శ్వేతసౌధం..

పాక్షిక నీలివర్ణంలోని అమెరికా అధ్యక్ష విమానం అంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దీనిని ఎగిరే శ్వేతసౌధంగా అభివర్ణిస్తారు. ఇందులో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉంటాయి. సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. అణ్వస్త్ర పేలుడు కారణంగా వచ్చే కొన్ని రకాల తరంగాలను కూడా ఇది తట్టుకోగలదు. శత్రుదేశ క్షిపణులను గుర్తించి.. వాటిని తప్పుదోవ పట్టించే రాడార్లు కూడా దీనిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని