Kate Middleton: ఇక కేట్‌ మిడిల్టన్‌ రాచరిక విధులకు తిరిగిరారా..?

బ్రిటన్ యువరాజు విలియం సతీమణి కేట్‌ మిడిల్టన్ (Kate Middleton)ఆరోగ్యంపై మరో కథనం చక్కర్లు కొడుతోంది. 

Published : 06 Jun 2024 14:03 IST

లండన్: బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్‌ (Cancer) బారినపడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. రాచరికవిధులకు ఎప్పటికీ తిరిగిరారన్నది తాజా కథనం. అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ దీనిని ప్రచురించింది. ప్రజలు ఇంతకుముందు చూసిన విధంగా ఆమె కనిపించరని పేర్కొంది.

కేట్‌ (Kate Middleton) శస్త్రచికిత్స చేయించుకున్నారని జనవరిలో ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్యాన్సర్ బయటపడటంతో చికిత్స తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అయితే తన ముగ్గురు పిల్లల విషయాలను మాత్రం చూసుకుంటున్నారని సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఆమె బాగానే కోలుకుంటున్నప్పటికీ.. రాచరిక విధులకు ఎప్పుడు వస్తారనే దానిపై స్పష్టత లేదని ఆ మీడియా సంస్థతో పేర్కొన్నాయి.

వైద్యులు అనుమతించిన తర్వాతే విధులకు రావొచ్చని, వచ్చే ఏడాది వరకు సమయం పట్టొచ్చని మునుపటి కథనాలు పేర్కొన్నాయి. ‘‘ఈ ఏడాది మొత్తం ఆమె డైరీ ఖాళీగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు’’ అని ఓ సన్నిహిత వర్గాన్ని ఉటంకించాయి. కొద్దినెలలుగా కేట్‌ బాహ్య ప్రపంచానికి కనిపించకపోయేసరికి.. కోమాలోకి వెళ్లిపోయుండొచ్చనే వదంతులు వ్యాప్తి చెందాయి. ఆ క్రమంలోనే ఆమె ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. మీరంతా మా మీద చూపిన ప్రేమ మరువలేనిది. ఈ చికిత్స పూర్తయ్యేవరకు మా గోప్యతకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని