‘ఇజ్రాయెల్ వినాశనాన్ని చూడాలనుకుంటున్నా’: హమాస్ నేతతో ఇరాన్ సుప్రీం లీడర్‌

ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఇరాన్‌ (Iran) సుప్రీం నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ నేతతో మాట్లాడుతూ నెతన్యాహు ప్రభుత్వానికి సవాలు విసిరారు. 

Published : 23 May 2024 19:58 IST

టెహ్రాన్‌: తన శత్రు దేశం ఇజ్రాయెల్‌ (Israel)ను ఉద్దేశించి ఇరాన్‌ (Iran) సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు హాజరైన హమాస్‌ నేత ఇస్మాయిల్ హనియాతో మాట్లాడుతూ.. తాను ఇజ్రాయెల్ వినాశనాన్ని చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

హమాస్‌తో యుద్ధం వేళ.. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. సిరియాలో ఇరాన్‌కు చెందిన జనరల్‌ను నెతన్యాహు సైన్యం మట్టుపెట్టడం వాటిని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంపై టెహ్రాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ వాటిని అడ్డుకున్నప్పటికీ.. రెండు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చనే ఆందోళన వ్యక్తమైంది. ఆ సమయంలోనే రైసీ దుర్మరణం పాలవడం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ దుర్ఘటనలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్‌ ఇప్పటికే స్పష్టంచేసింది. మరోవైపు ఇరాన్ నుంచి ఆ దేశం పాత్రపై ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇదిలాఉంటే.. ఇదివరకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ అణు బెదిరింపులకు పాల్పడింది. ఖమేనీ సలహాదారు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు అణుబాంబు తయారీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇరాన్‌ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం మా సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మా అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడిచేస్తే మా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది’’ అని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రైసీ మరణం వేళ.. కొత్తగా వచ్చే అధ్యక్షుడి నిర్ణయాలు పశ్చిమాసియా స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని