King Charles III: దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్‌ ఛార్లెస్‌ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు

బ్రిటన్‌ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్‌ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Published : 16 May 2024 00:04 IST

లండన్‌: బ్రిటన్ రాజుగా పట్టాభిషిక్తుడైన ఏడాది తర్వాత తన అధికారిక చిత్రపటాన్ని కింగ్ ఛార్లెస్‌ 3 (King Charles III) ఆవిష్కరించారు. దానిని రాజకుటుంబం అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బ్రిటన్ ఆర్మీకి చెందిన వెల్ష్‌ గార్డ్స్‌ యూనిఫాం ధరించిన ఛార్లెస్‌ అందులో దర్శనమిచ్చారు. దాని నిండా ఎరుపు, కొంచెం ఉదా రంగు ఛాయలు కనిపించాయి. ఒక సీతాకోక చిలుక ఆయన భుజంపై వాలడానికి సిద్ధంగా ఉన్నట్లు అందులో కనిపిస్తుంది. మొత్తం ఆరు అడుగుల ఎత్తులో ఉన్న ఆ పటాన్ని రూపొందించడానికి ఆర్టిస్ట్‌ జొనాధన్‌కు మూడు సంవత్సరాలు పట్టిందట. ఇక ఆ చిత్తరువుపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత చెత్తదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు దీనిని ఎవరు ఓకే చేశారో..?అది కలవరపెడుతోందంటూ విమర్శించారు.

బ్రిటీష్‌ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత గత ఏడాది తొలి పట్టాభిషేకం జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది మేలో ఛార్లెస్‌కు కిరీటధారణ జరిగింది. ఏడు దశాబ్దాల పాటు యూకేను పాలించిన రాణి ఎలిజబెత్‌-2. 2022లో తుదిశ్వాస విడవడంతో ఆమె పెద్ద కుమారుడైన ఛార్లెస్‌ సింహాసనాన్ని అధిష్టించారు. ఇదిలాఉంటే.. కొన్ని నెలల క్రితం ఆయనకు క్యాన్సర్‌ నిర్ధరణ అయింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని