రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. జపాన్‌లో 15 రోజుల్లో రెండో ఘటన

జపాన్‌(Japan)లో మరోసారి రెండు ప్యాసింజర్‌ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

Updated : 16 Jan 2024 18:41 IST

(ప్రతీకాత్మక చిత్రం)

టోక్యో: ఈ నెల ప్రారంభంలో జపాన్‌(Japan) విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం మరువకముందే.. మంగళవారం అదేతరహా ఘటన చోటుచేసుకుంది. రన్‌వేపై రెండు విమానాలు (Passenger Planes) ఢీకొన్నాయి. న్యూ చిటోస్ విమానాశ్రయంలో రన్‌వే(Runway)పై ఆగిఉన్న క్యాథే పసిఫిక్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్లేన్‌ ఢీకొంది.

కొరియన్ సంస్థకు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా.. ఈ ఘటన జరిగింది. అప్పుడు దానిలో 289 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. మరోవైపు క్యాథే సంస్థ విమానంలో జనాలు ఎవరూ లేరు. ఈ రెండు ఢీకొన్నా మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. జపాన్‌లో ప్రస్తుతం పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

ఇదిలా ఉండగా..  జనవరి 2న టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొట్టుకోవడంతో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సపోరో నగరంలోని షిన్‌ చిటోస్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌ 516 విమానం హనెడా విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో కోస్టు గార్డు (తీర రక్షక దళం) విమానాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్యాసింజర్‌ విమానం మంటల్లో చిక్కుకుంది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి.. విమానంలోని 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న అయిదుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని