Korean Singer: కొరియన్‌ సింగర్‌ ‘చోయ్‌’ ఆత్మహత్య!

చిన్న వయసులోనే దక్షిణ కొరియా (South Korea)తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న సింగర్‌ చోయ్‌ సంగ్‌-బాంగ్‌ (33) మృతిచెందాడు.

Published : 21 Jun 2023 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ కొరియా (South Korea) యూత్‌లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న గాయకుడు చోయ్‌ సంగ్‌-బాంగ్‌ (33) అనుమానస్పద పరిస్థితుల్లో మరణించాడు. దక్షిణ సియోల్‌లోని యెవోక్‌సమ్‌-డాంగ్‌ జిల్లాలోని తన ఇంటిలో విగతజీవిగా పడినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడి ఇంట్లో పరిస్థితులను బట్టి చూస్తే చోయ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతకుముందు రోజు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ లేఖను అప్‌లోడ్‌ చేసిన ఆయన.. తన మూర్ఖపు చేష్టలతో బాధపడిన వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. తనకు ఇచ్చిన విరాళాలను (Fundraising) తిరిగి ఇచ్చేస్తానని అందులో పేర్కొన్నాడు.

దక్షిణ కొరియాలో నిర్వహించే ఓ రియాలిటీ షో (Reality Show) ‘కొరియా గాట్‌ టాలెంట్‌’-2011లో చోయ్‌ రెండోస్థానంలో నిలిచాడు. తాను ఓ అనాథనని.. ఓ ఆశ్రమం నుంచి తప్పించుకొని వచ్చినట్లు చెప్పుకునేవాడు. చిన్నతనంలో  తాను ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పుకునే చోయ్‌.. ఇంటర్నెట్‌ సెలబ్రిటీగా ఎదిగిన వైనంపై ఓ పుస్తకం కూడా రాసుకున్నాడు. అక్కడి లాబెల్‌ బాంగ్‌బాంగ్‌ అనే కంపెనీతో అతడు చేసుకున్న ఒప్పందం సంచలనం సృష్టించింది. ఇలా అనతికాలంలోనే కొరియన్‌ యువతతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్‌ అయ్యాడు.

ఇలా చిన్న వయసులోనే సెలబ్రిటీగా ఎదిగిన చోయ్‌ను కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా తాను క్యాన్సర్‌ బారిన పడ్డానని, చికిత్స కోసం డబ్బులు కావాలంటూ చేసిన నగదు సమీకరణ (Fundraising) ఆయన్ను చీకట్లోకి నెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత అది ఫేక్‌ అని తేలింది. దీంతో తన తప్పును అంగీకరించిన చోయ్‌.. ఆ విరాళాలు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. అడిగిన వారికి ఇప్పటికే ఇచ్చేశానని.. తన వల్ల బాధపడిన మిగతా వారికీ డబ్బు చెల్లిస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని