Ukraine Crisis: అమెరికా అండ లేకపోతే.. క్రెమ్లిన్‌పై దాడి సాధ్యమా?: రష్యా

అమెరికా (USA) అండ లేకుండా రష్యా (Russia) అధ్యక్షభవనంపై ఉక్రెయిన్‌ ఉగ్రమూకలు (Ukraine) దాడికి పాల్పడే సాహసం చేయలేవని రష్యా తెలిపింది. అయితే సరైన సమయంలో దీటుగా స్పందించి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.

Published : 06 May 2023 01:32 IST

పనాజీ: అగ్రరాజ్యం అమెరికా (USA) అండ లేకుండా రష్యా (Russia) అధ్యక్ష భవనం (Kremlin)పై ఉక్రెయిన్‌ ఉగ్రమూకలు దాడి చేసే సాహసం చేయలేవని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోవ్‌ తెలిపారు. మొత్తం ఈ వ్యవహారానికి అమెరికాయే పథక రచన చేసి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. గోవా రాజధాని పనాజీలో నిర్వహిస్తున్న షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అధ్యక్ష భవనంపై దాడి సంఘటనను ఆయన ప్రస్తావించారు. అమెరికా మద్దతు లేనిదే ఉక్రెయిన్‌ ఇంతటి దుందుడుకు చర్యకు ఒడిగట్టే అవకాశమే లేదని ఆయన అన్నారు. అయితే, సరైన సమయంలో దీటుగా స్పందించి బదులు తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు.

‘‘వారి సాయం లేకుండా, కీవ్‌లోని ఉగ్రవాదులు రష్యా అధ్యక్ష భవనంపైకి దాడి చేయలేరని అందరికీ తెలుసు’’ అని పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ లవ్రోవ్‌ మీడియాకు తెలిపారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర చేస్తోందంటూ రష్యా బుధవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కుట్రలో భాగంగానే అధ్యక్ష భవనంపై డ్రోన్‌ దాడి జరిగిందని పేర్కొంది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన రెండు డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంటూ.. కారకులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. భారత్‌ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ శాఖ మంత్రి దీనిపై తాజాగా స్పందించారు. ఉక్రెయిన్‌కు సరైన సమయంలో బదులిస్తామని అన్నారు. 

మరోవైపు అధ్యక్షభవనంపై కీవ్‌ డ్రోన్‌ దాడికి పాల్పడిందనడాన్ని ఉక్రెయిన్‌ ఖండించింది. ఈ ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అలా చేయడం ఉక్రెయిన్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని.. కేవలం రష్యా మరింతగా దాడులు చేసేందుకు కారణమవుతుందని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో రష్యా చేయనున్న దాడులను సమర్థించుకోవడానికే క్రెమ్లిన్‌ తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. తాజా పరిణామాలను చూస్తుంటే ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందని జెలెన్‌స్కీ సలహాదారు మైకిలో పొదొల్యాక్‌ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు దాడి ఘటనలో తమ హస్తం ఉందనడాన్ని అమెరికా సైతం కొట్టిపారేసింది. అమెరికాపై విద్వేషం రగిల్చేందుకు రష్యా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడింది.  యూరోపియన్‌ యూనియన్‌ (EU) విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ కూడా గురువారం మాస్కోను హెచ్చరించారు. ఈ ఆరోపణలను సాకుగా చూపించి యుద్ధం తీవ్రతను కొనసాగించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, ఇది సరికాదని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని