Iran: లేజర్‌ బీమ్‌.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై విభిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. అంతరిక్ష లేజర్లు.. వారసత్వ పోరు కారణంగానే  ఆయన ప్రాణాలు కోల్పోయారని వీటిల్లో పేర్కొంటున్నారు. 

Updated : 21 May 2024 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెల్‌ 212 హెలికాప్టర్‌ కూలి ఆదివారం సాయంత్రం ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడంపై పలు రకాల ప్రచారాలు మొదలయ్యాయి. వారసత్వ పోరు కూడా రైసీ మరణం వెనుక ఉండొచ్చని ఆన్‌లైన్‌ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు అత్యాధునిక లేజర్‌బీమ్‌ను అంతరిక్షం నుంచి ప్రయోగించి ఆయన హెలికాప్టర్‌ను కూల్చి వేసి ఉండొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇక దర్యాప్తు బృందం మాత్రం ఈ ఘటనపై ఎక్కువ వివరాలను పంచుకోలేదు. 

వారసత్వ పోరుపై అనుమానాలు..

ప్రస్తుతం ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. వాస్తవానికి ఖమేనీ కుమారుడు ముజ్తబా కూడా ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ మాజీ సలహాదారు గాబ్రియన్‌ నోర్నహ ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ‘‘ రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడైన ముజ్తబాకు దక్కడం ఖాయం’’ అని పేర్కొన్నారు. రైసీ-ముజ్తబా మధ్య ఎప్పటి నుంచో పోటీ నెలకొందని వెల్లడించారు. తాజాగా ఖమేనీ ఇరాన్‌ ప్రజలను ఆందోళన చెందొద్దని చెప్పడానికి కూడా వారి అనుమానాలు దూరం చేయడానికే అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఖమేనీ వయస్సు 85 ఏళ్లు . ఇక రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకొన్న మహమ్ముద్‌ ముఖ్‌బెర్‌ మరో 50 రోజులు ఆ పదవిలో కొనసాగనున్నారు.  

  • అంతరిక్ష లేజర్‌ ఆయధాన్ని వాడి రైసీ హెలికాప్టర్‌ను కూల్చేసి ఉండొచ్చనే మరో ప్రచారం ఎక్స్‌లో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలు ఇటువంటి ఆయుధాలను వాడుతుండటంతో ఈ కుట్రకోణాన్ని కూడా నెటిజన్లు నమ్ముతున్నారు. మరో వైపు ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం ఇటువంటి దాడి ఏదీ జరగలేదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌ అమెరికా కుట్ర అంటూ..

ఇరాన్ అణు శాస్త్ర వేత్త మొహసీన్‌ ఫక్రిజాద హత్యలో ఇజ్రాయెల్‌ అత్యాధునిక రోబోలను వాడినట్లు తేలింది.  ఇక అంతకుముందు అణు కేంద్రంలో పరికరాల ధ్వంసంలో కూడా ఇజ్రాయెల్‌ ఇదే విధంగా వ్యవహరించింది.  ఈ నేపథ్యంలో తాజాగా రైసీ మరణంలో కూడా అటువంటి ఆయుధాలను వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక విదేశాంగశాఖ మాజీ మంత్రి మహమ్మద్‌ జావెద్‌ జారిఫ్‌ మాత్రం అమెరికానే ఈ మరణానికి కారణమని పేర్కొన్నారు. తమ హెలికాప్టర్లకు అవసరమైన విడి భాగాలు కొనుగోలు చేయనీయకుండా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలను బలితీసుకొన్నట్లు చెబుతున్నారు.  

ఇరాన్‌ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు ఈ ఘటనతో స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను 1979కు ముందు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. తర్వాత ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది. ఇరాన్‌ విమానయాన, హెలికాప్టర్‌ సంస్థలు.. తమ వద్ద ఉన్న లోహవిహంగాల్లో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి, మిగతావాటికి అమరుస్తున్నాయి. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్‌ తయారుచేస్తోంది. వాటి నాణ్యత ప్రశ్నార్థకం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని