India-US: భారత్‌కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్‌ చట్టసభ్యులు

India-US: భారత్‌-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్‌ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు.

Updated : 17 May 2024 08:52 IST

India-US | వాషింగ్టన్‌: మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవడం మేలని సూచించారు. ఇతర దేశాలకు హితవు చెప్పేముందు అమెరికా (USA) వ్యవస్థలోని లోపాలనూ గమనించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘దేశీ డిసైడ్స్‌’ పేరిట నిర్వహించిన సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘భారత్‌ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉంది. అలాంటి వారికి మానవ హక్కుల గురించి చెప్పడం హితబోధ చేసినట్లవుతుంది. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు ఉపన్యాసాలు ఇస్తున్నాయని వారు (భారత్‌) స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి.. వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి? తద్వారా ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఎలా కాపాడుకోవాలి? అనే ధోరణిలో చర్చించుకుంటే మేలు’’ అని కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా అన్నారు.

భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి

ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ, బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బేరా తెలిపారు. మరోవైపు అమెరికా వ్యవస్థలోని పరిమితులనూ లేవనెత్తాల్సిన అవసరం ఉందని మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇతర దేశాల్లోని లోపాల గురించీ మాట్లాడొచ్చని అన్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్య ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామి అని గుర్తుచేశారు. ప్రాంతీయ అవసరాలతో పాటు ఇతర అంశాల్లో భారత్‌ అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

ఇండియా-యూఎస్‌ మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని మరో సభ్యుడు థానేదార్‌ తెలిపారు. రష్యాను విడిచిపెట్టి భారత్‌ పూర్తిగా అమెరికాతో బంధాన్ని బలపర్చుకోవాలని హితవు పలికారు. భారత్‌ ఇప్పుడు గొప్ప ఆర్థిక శక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని