Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది.

Updated : 20 May 2024 09:42 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ (IRCS) ప్రకటించింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ వెల్లడించింది. అంతకుముందు ప్రమాదస్థలానికి సంబంధించిన కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్‌లను మానవరహిత విమాన (UAV) గాలింపులో కనుగొన్నట్లు తెలిపింది. ఆ ప్రాంతానికి IRCS దళాలు చేరుకున్నాయి.

‘తావిల్‌’ అనే ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి (Iran President helicopter crash) ఉండొచ్చని తొలుత అనుమానించారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు తుర్కియేకు చెందిన ‘అకింజి’ అనే యూఏవీ.. కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ‘ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌’ (IRGC) కమాండర్‌ సైతం ధ్రువీకరించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ.. రైసీ (Ebrahim Raisi) ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వప్రయత్నాలు చేశాయి. పొగ మంచు, వర్షం.. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. తూర్పు అజర్‌బైజాన్‌ రాష్ట్రంలోని వర్జాకాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. మరోవైపు ఐఆర్‌సీఎస్‌ తమ 46 మెరుపు దళాలను రంగంలోకి దించినట్లు ప్రకటించింది. హెలికాప్టర్‌ కూలినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్రదేశం సమీపానికి దాదాపు నాలుగు బృందాలు చేరినట్లు ఐఆర్‌సీఎస్‌ అధిపతి రజీహ్ అలిష్వాండి ఆదివారం రాత్రి వెల్లడించారు. కానీ, వాతావరణం సహకరించకపోవటంతో మరింత ముందుకు వెళ్లేందుకు తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు.

ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆదివారం ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం పలు దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్‌ కలాసీ, ఖొదావరిన్‌ అనే రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని