Maldives: గాజాలో దాడులు.. ‘ఇజ్రాయెల్‌’పై మాల్దీవులు కీలక నిర్ణయం!

గాజాపై దాడులకు నిరసనగా ఇజ్రాయెల్‌ పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధించాలని మాల్దీవులు నిర్ణయించింది.

Published : 02 Jun 2024 23:10 IST

మాలే: గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) దాడులను ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. మాల్దీవుల్లో (Maldives)నూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానికంగా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ద్వీపదేశం కీలక చర్యలకు సిద్ధమైంది. ఇజ్రాయెల్‌ పాస్‌పోర్ట్‌ ఉన్నవారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ హోంశాఖ మంత్రి అలీ ఇహుసన్‌ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. అదేవిధంగా గాజా (Gaza)లోని పాలస్తీనియన్లకు సాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టేందుకూ ముందుకొచ్చినట్లు పేర్కొంది.

బైడెన్‌ ప్రతిపాదనను అంగీకరించాలి

‘‘ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్‌పై మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని వీలైనంత త్వరగా నిషేధించేందుకు అవసరమైన చట్టపరమైన సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది’’ అని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ నుంచి ఏటా దాదాపు 15 వేల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తుంటారు. గతేడాది అక్టోబరులో 7న హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. టెల్‌అవీవ్‌ దాడుల్లో ఇప్పటివరకు 36 వేలమందికిపైగా మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని