Maldives: మాల్దీవుల ఆర్థిక సవాళ్లకు భారత రుణాలు కారణం కాదు: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

మాల్దీవులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు పరిష్కారం కావాలంటే మొండి పట్టుదల వీడి పొరుగుదేశాలతో చర్చలు జరపాలని అధ్యక్షుడు ముయిజ్జుకు మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ సూచించారు.  

Published : 25 Mar 2024 01:24 IST

మాలే: మాల్దీవులు (Maldives) ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) మొండి పట్టుదల వీడి పొరుగుదేశాలతో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ సూచించారు. రాజధాని మాలేలో నిర్వహించిన పార్టీ ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణపునర్నిర్మాణం కోసం ముయిజ్జు భారత్‌తో చర్చలు జరపాలనుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనాలను తాను చూసినట్లు తెలిపారు. అయితే మాల్దీవుల అప్పులు భారత్‌ ఇచ్చిన రుణాల వల్ల కాదని పేర్కొన్నారు. చైనాకు తమ దేశం 18 బిలియన్ల మాల్దీవియన్‌ రూఫియా (MVR) బకాయి పడిందని, భారత్‌ నుంచి 8 బిలియన్ల ఎంవీఆర్‌లను రుణంగా తీసుకుందన్నారు.

‘‘ప్రస్తుతం మాల్దీవులు ఎదుర్కొంటున్న పరిస్థితిని పొరుగుదేశాలు అర్థం చేసుకుని సహాయం చేస్తాయనే నమ్మకం నాకు ఉంది. అయితే మనం కచ్చితంగా మొండి పట్టుదల వీడి ఆ దేశాలతో చర్చలు జరపాలి. చాలా దేశాలు మనకు సహాయం చేయగలవు. కానీ ముయిజ్జు రాజీపడడానికి సిద్ధంగా లేరు. ఆయన ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నా’’ అని సోలిహ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభిస్తోందని, మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత వ్యతిరేఖ ధోరణి అవలంబిస్తోన్న విషయం తెలిసిందే. మన దేశానికి చెందిన 88 మంది భద్రతా బలగాలు, మానవతా సాయం కింద వైద్య అవసరాల కోసం పనిచేస్తున్న హెలికాప్టర్లు మే 10 నాటికి తమ దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోవాలని గడువు విధించారు. అయితే ఇటీవల రుణ విముక్తి కోసం ముయిజ్జు భిన్న స్వరం వినిపించారు. భారత్‌ తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్రదేశమేనని, ఆ దేశం నుంచి రుణ మినహాయింపు కోరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ సోలిహ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని