Mohamed Muizzu: స్వరం మార్చిన ముయిజ్జు.. రుణవిముక్తి చేయాలని విజ్ఞప్తి

అప్పుల్లో కూరుకుపోయిన మాల్దీవులకు భారత్‌ రుణవిముక్తి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు కోరారు. ఈ మేరకు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు. 

Updated : 23 Mar 2024 14:13 IST

మాలె: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) భిన్న స్వరం వినిపించారు. భారతదేశం (India) తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్రుడిగా కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి రుణవిముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు బకాయిపడింది. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ద్వీప దేశం ప్రాధేయపడుతోంది. గత నవంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మే 10 నాటికి భారత్‌కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని గడువు విధించిన ముయిజ్జు తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయిజ్జు తొలిసారిగా గురువారం స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాల్దీవులకు సాయం అందించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని భారత్‌ను అభ్యర్థించారు. ‘‘గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్‌ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయి. తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ ఆ దేశంతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం కలిగించం. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సహకరిస్తాం’’ అని ముయిజ్జు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీతో దుబాయి వేదికగా జరిగిన కాప్‌ 28 సదస్సు సమయంలోనూ ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్‌ గత కొన్నేళ్లుగా మానవతాసాయం కింద ఆ ద్వీపదేశంలో అత్యవసర వైద్యసేవలు అందిస్తోంది. అక్కడ మన దేశ నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్‌ విమానం ఇప్పటివరకు సేవలందిస్తున్నాయి. దాదాపు 80 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. గత ఐదేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అవసరమైన సుమారు 600 మందిని వారు భారత్‌కు తరలించారు. వారంతా మే 10లోపు తిరిగి వెళ్లిపోవాలని ఇటీవల ముయిజ్జు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. భారత్‌తో సంబంధాలు బలహీనపడుతుంటంతో ముయిజ్జు సర్కార్‌.. అత్యవసర వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముయిజ్జు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మాల్దీవులు లక్షద్వీప్‌ సమూహంలోని మినీకాయ్‌ ద్వీపం నుంచి 70 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంటుంది. పశ్చిమ తీరానికి 300 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహా సముద్రంలోని అంతర్జాతీయ జలమార్గాలతో అనుసంధానమై ఉండటంతో వాణిజ్యపరంగా ఇది కీలకంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని