Modi- Muizzu: మోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జు.. అధ్యక్షుడిగా తొలిసారి భారత్‌కు రాక

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు హాజరుకానున్నారు.

Published : 08 Jun 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవులు (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Muizzu) హాజరుకానున్నారు. ఈమేరకు భారత్‌ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించినట్లు మాల్దీవుల అధ్యక్ష భవనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నానని ముయిజ్జు పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులో మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన భారత్‌ పర్యటనకు రానుండటం ఇదే మొదటిసారి.

చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు.. అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచి భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇదివరకటి అధ్యక్షుల్లా కాకుండా.. తన మొదటి పర్యటన తుర్కియే, ఆ తర్వాత చైనాలో జరిపారు. భారత్‌ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించారు. దేశంలో చేపడుతున్న పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే.. భారత్‌తో సన్నిహిత సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకునే దిశగా ప్రధాని మోదీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని, ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశలో సాగుతున్నాయనే సందేశం తన పర్యటన ద్వారా నిరూపితమవుతుందని ఆయన తాజాగా పేర్కొన్నారు.

మూడంచెల భద్రత.. 5 కంపెనీల కేంద్ర బలగాలు.. మోదీ ప్రమాణ స్వీకారానికి పకడ్బందీ ఏర్పాట్లు

మూడోసారి భారత ప్రధానిగా మోదీ ఆదివారం సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘సార్క్‌’ దేశాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తమకు ఆహ్వానం అందినట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌ తదితర విదేశీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు దేశ రాజధానిలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని