PM Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు!

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు హాజరయ్యే అవకాశముంది. ఈమేరకు అక్కడి మీడియా వెల్లడించింది.

Published : 07 Jun 2024 19:51 IST

మాలె: ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి (PM Modi Oath Ceremony) మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు ముయిజ్జు (Muizzu) హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జు స్వీకరించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన మోదీ (PM Modi) జూన్‌ 9న (ఆదివారం) దిల్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ముయిజ్జు శనివారమే దిల్లీ చేరుకుంటారని అక్కడి మీడియా పేర్కొంది. అయితే, భారత్‌ పర్యటనపై మాల్దీవుల అధ్యక్ష భవనం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

మరోవైపు ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో మోదీని.. ఎక్స్‌ వేదికగా బుధవారం ముయిజ్జు అభినందించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతుండటం సంతోషంగా ఉందన్నారు. శ్రేయస్సు, స్థిరత్వాన్ని దృష్టిలోపెట్టుకొని ఇరుదేశాలకు ప్రయోజనం కలిగేలా కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ ముయిజ్జు భారత్‌కు వస్తే.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మన దేశంలో ఆయన తొలి అధికారిక పర్యటన ఇదే. 

గతేడాది నవంబర్‌ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు.. చైనా అనుకూల విధానాలను అవలంబిస్తూ.. భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే భారత్‌ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించారు. ఈమేరకు మే 10 నాటికి మొత్తం 88 మంది ఆర్మీ సిబ్బంది అక్కడినుంచి వచ్చేశారు. మరోవైపు మాల్దీవుల్లో చేపడుతున్న పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం ముయిజ్జు చైనా   వైపే మొగ్గు చూపుతున్నారు.

కాగా, మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ తదితర దేశాధినేతలు హాజరయ్యే అవకాశముంది. ఈ మేరకు అధికారులు వారికి ఆహ్వానాలు పంపించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని