Maldives: పర్యటకం కుదేలు.. దిగొచ్చిన మాల్దీవులు!

మాల్దీవులకు భారత్‌ నుంచి పర్యటకం రూపంలో గట్టి షాక్‌ తగిలింది. దీంతో కుదేలైన అక్కడి ప్రముఖ పర్యటక సంస్థ.. భారతీయులను ఆకర్షించేందుకు సిద్ధమైంది.

Updated : 12 Apr 2024 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవుల (Maldives)కు భారత్‌ నుంచి పర్యటకం రూపంలో గట్టి షాక్‌ తగిలింది. ఈ పరిణామాలతో కుదేలైన అక్కడి పర్యటక సంస్థలు.. భారతీయులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య ప్రయాణ, పర్యటక సహకారాన్ని పెంపొందించడంపై ‘మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ (MATATO)’ ప్రతినిధులు గురువారం మాలేలో భారత హైకమిషనర్‌తో ఈ మేరకు చర్చలు జరిపారు.

‘‘మాల్దీవులకు భారత్‌ ఇప్పటికీ కీలకమైన మార్కెట్‌. ఈ క్రమంలోనే మా దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్‌లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో, ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడంలో, ఆయా కార్యక్రమాల నిర్వహణ విషయంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తాం’’ అని MATATO ఒక ప్రకటనలో వెల్లడించినట్లు స్థానిక వార్తాసంస్థ తెలిపింది.

చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. అనేక మంది భారతీయులు.. ఆ దేశ టూర్‌ ప్లాన్‌ను విరమించుకున్నారు. దీంతో పర్యటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్‌.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్‌ (66,999), రష్యా (66,803), ఇటలీ (61,379), జర్మనీ (52,256), భారత్‌ (37,417)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని