Maldives: చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్‌తో దౌత్యం జరిపేనా!

చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది.

Updated : 22 Apr 2024 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాల్దీవుల (Maldives) పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (PNC) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. ముయిజ్జకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్‌లు నిశితంగా పరిశీలించాయి.

మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 602 బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటుచేశారు. వీటితోపాటు మూడు విదేశాల్లో (భారత్‌లోని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్‌) వీటిని ఉంచారు. మొత్తం 2.84 లక్షల ఓటర్లు ఉండగా.. 75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఫలితాల్లో ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ 70 స్థానాలను గెలుచుకోగా.. దాని మిత్రపక్షాలు మూడుచోట్ల విజయం సాధించాయి. భారత్‌కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహహ్మద్‌ సోలికి చెందిన మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (MDP) 15 సీట్లకే పరిమితమైంది. ఈ పార్టీ గతంలో 65 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. 

చైనా వైపు మొగ్గుచూపు..

మాల్దీవుల్లో చిన్న ద్వీపాలు కలిపి దాదాపు 1,192 ప్రాంతాలున్నాయి. ఇవన్నీ 800 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్నాయి. శ్వేతవర్ణపు బీచ్‌లు, రిసార్టులతో మెరిసిపోయే ఈ ప్రాంతం.. హిందూ మహాసముద్రంలో భౌగోళిక రాజకీయాలకు  వేదికగా మారింది. అయితే, తమ దేశంపై భారత్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముయిజ్జు.. చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేశారు. మూడు నెలల క్రితం చైనాలో పర్యటించి.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి రక్షణ సహకారం, ఇతర అభివృద్ధి  ప్రాజెక్టుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డ్రాగన్‌ కంపెనీలకే ముఖ్యమైన కాంట్రాక్టులు కట్టబెట్టారు.

భారత్‌కు డెడ్‌లైన్‌..

‘చిన్న దేశమైనంత మాత్రాన.. మమ్మల్ని వేధించేందుకు లైసెన్సు ఇవ్వలేదంటూ’ భారత్‌ను ఉద్దేశిస్తూ (India Maldives Conflict) ముయిజ్జు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్‌కు చెందిన సైన్యం తిరిగి వెళ్లిపోవాలని డెడ్‌లైన్‌ విధించారు. ఈక్రమంలో భారత బలగాలు వెనక్కి వచ్చేశాయి. అధ్యక్షుడి ఈ చర్యలపై సొంత దేశంలోనే విమర్శలు వచ్చాయి. చివరకు మాటమార్చిన ఆయన భారత్‌ ఆర్థికసాయం తమకెంతో ముఖ్యమని చెప్పారు.

66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

భారత్‌ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ముయిజ్జును విపక్ష ‘ఎండీపీ’ కట్టడి చేసేందుకు యత్నించింది. ముఖ్యంగా భారత సైన్యాన్ని వెనక్కి పంపించివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 2018 నుంచి అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన ఓ నివేదికపై దర్యాప్తు జరపడంతోపాటు అధ్యక్షుడిపై అభిశంసన చేపట్టాలని డిమాండ్‌ చేసింది. అయినప్పటికీ భారత్‌ వ్యతిరేక నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన మహమ్మద్‌కే అక్కడి ప్రజలు పట్టం కట్టారు.

మొన్నటివరకు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండటంతో మహమ్మద్‌ ముయిజ్జు ఆటలు సాగలేదు. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ బలం తక్కువగా ఉండటంతో అక్కడి పార్లమెంటులో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు నచ్చిన విధానాలను రూపొందించుకునేందుకు మార్గం సుగమమైనట్లు విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో భారత్‌తోనూ ముయిజ్జు దౌత్యపరంగా ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారనే విషయాన్ని చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని