Facebook: ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లాక్‌పై కోర్టుకు.. ₹41 లక్షల పరిహారం

కారణం లేకుండా తన అకౌంట్‌ను లాక్‌ చేయడంపై ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌పై కోర్టుకెళ్లాడు. తన అకౌంట్‌ను ఎప్పటిలానే పునరుద్ధరించుకున్నాడు. 

Published : 16 Jun 2023 15:30 IST

ఇంటర్నెడెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై (Facebook) ఓ వ్యక్తి న్యాయపోరాటానికి దిగాడు. అకారణంగా తన అకౌంట్‌ను (Facebook account) లాక్‌ చేయడమే కాకుండా.. సమస్యేంటో కనుక్కొందామని ఫోన్‌ చేస్తే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో ఫేస్‌బుక్‌పై కోర్టులో దావా వేశాడు. ప్రతిగా రూ.41 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో జరిగింది.

జార్జియాకు చెందిన క్రాఫోర్డ్‌ ఓ సారి పొలిటికల్‌ కామెంట్‌ చేశాడన్న కారణంతో ఫేస్‌బుక్‌ అతడిని హెచ్చరించింది. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు ఉదయం ఫేస్‌బుక్‌ తెరుద్దామని చూస్తే అకౌంట్‌ లాక్‌ చేసినట్లు చూపించింది. ఎందుకు లాక్‌ చేశారన్న దానిపై ఫేస్‌బుక్‌ అతడికి ఎలాంటి వివరణా ఇవ్వలేదు. సమస్యను పరిష్కరించుకుందామంటే ఎవరూ అందుబాటులోకి రాలేదు. తన అకౌంట్‌ను పునరుద్ధరించుకోవడానికి అప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. ఇలాగైతే లాభం లేదని స్వతహాగా లాయర్‌ అయిన క్రాఫోర్డ్‌.. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ అయిన మెటాపై న్యాయపోరాటానికి దిగాడు.

అకౌంట్‌ను లాక్‌ చేయడంపై 2022 ఆగస్టులో కోర్టులో దావా వేశాడు. ఎలాంటి ఉల్లంఘనా లేకపోయినా తన అకౌంట్‌ను ఫేస్‌బుక్‌ లాక్‌ చేసిందని ఆరోపించాడు. తాను అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దావా వేసినా.. ఫేస్‌బుక్‌ లీగల్‌ టీమ్‌ స్పందించలేదు. ఈ చర్య న్యాయమూర్తికి సైతం కోపం తెప్పించింది. దీంతో 50 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.41 లక్షలు) చెల్లించాలని మెటాను ఆదేశించారు. 

న్యాయస్థానం ఆదేశాలపై స్పందించిన మెటా.. వెంటనే క్రాఫోర్డ్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను పునరుద్ధరించింది. పరిహారం కోసం తాను దావా వేయలేదని, వినియోగదారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకూడదన్న ఉద్దేశంతోనే వేసినట్లు క్రాఫోర్డ్‌ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారం అప్పుడే తేలిపోలేదు. తన అకౌంట్‌ను పునరుద్ధరించినప్పటికీ.. న్యాయస్థానం ఆదేశించిన పరిహారంలో ఒక్క డాలరు కూడా తనకు చెల్లించలేదని క్రాఫోర్డ్‌ పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలను ఫేస్‌బుక్‌ పెడచెవిన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. దీనిపై ఫేస్‌బుక్‌ స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని