Moscow: మాస్కోలో భారీ అగ్ని ప్రమాదం.. బాంబుపేలుళ్లని అనుమానం..!

రష్యా రాజధాని మాస్కో(moscow) శివార్లలోని ఖిమ్కీ మెగా షాపింగ్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

Published : 09 Dec 2022 19:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) రాజధాని మాస్కో(moscow) శివార్లలోని ఖిమ్కీ మెగా షాపింగ్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దాదాపు 7,000 చదరపు మీటర్లు ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పేలుళ్ల చప్పుళ్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. రష్యా(Russia)లోని అగ్నిమాపక సిబ్బంది వీటిని ఆర్పేందుకు కష్టపడుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం  ప్రారంభానికి ఈ కాంప్లెక్సులో పశ్చిమ దేశాలకు చెందిన బ్రాండ్లను విక్రయించేవారు. వీటిల్లో ఐకియా వంటి బడా కంపెనీల స్టోర్లు కూడా ఉన్నాయి.

తొలుత ఈ కాంప్లెక్స్‌పై భాగంలో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత మొత్తం కాంప్లెక్స్‌కు అగ్నికీలలు విస్తరించాయి . ఈ కాంప్లెక్స్‌ పైభాగం కుప్పకూలింది.  మంటలు వ్యాపించడానికి ముందు పేలుళ్లు వినిపించినట్లు స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. మంటలు అంతవేగంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ మొత్తం ఎలా వ్యాపించాయన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరో ఉద్దేశ పూర్వకంగానే ఈ చర్యకు పాల్పడి ఉంటారని ఇంటర్‌ఫాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ అభిప్రాయపడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక వ్యక్తి మరణించినట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. 20ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. 

రష్యన్‌ ఇన్వెస్టిగేటివ్‌ కమిటీ దీనికి కారణాలను అన్వేషించే పనిలోపడింది. భవన మరమ్మతుల సమయంలో సురక్ష ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడం, పైకప్పు ఒక్కసారిగా కూలడమే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా(Russia)లో పలు చోట్ల మిస్టరీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. దీంతో తాజా ఘటనను కూడా ఆ కోణంలో చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని