Rupert Murdoch: 93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్‌కు ఐదో పెళ్లి

అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్‌ మర్దోక్‌ 93 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకున్నారు.

Published : 03 Jun 2024 05:01 IST

లాస్‌ ఏంజెల్స్‌: అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్‌ మర్దోక్‌ 93 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 25 ఏళ్లు చిన్నవారైన రిటైర్డ్‌ పరమాణుజీవ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను మనువాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో శనివారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫొటోలు బ్రిటన్‌ పత్రిక ‘ ది సన్‌’లో ప్రచురిత మయ్యాయి. ఈ వివాహానికి న్యూ ఇంగ్లాండ్‌ పాట్రియోట్స్‌ యూఎస్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ యజమాని రోబెర్ట్‌ క్రాఫ్ట్‌ (82), ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్‌ (50) హాజరయ్యారు.

మర్దోక్‌కు ఇది ఐదో వివాహం. మర్దోక్‌ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను వివాహమాడారు. 1960ల్లో వీరి బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత జర్నలిస్ట్‌ అన్నా మరియా మన్‌, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌, అమెరికా మోడల్‌ జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్నారు. మర్దోక్‌ తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీలో జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో వివాహమైంది.

1950ల్లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన మర్దోక్‌.. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, ది సన్‌ వార్తా పత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేశారు. 1996లో ఫాక్స్‌ న్యూస్‌ను ప్రారంభించారు. 2013లో న్యూస్‌కార్ప్‌ను స్థాపించారు. మర్దోక్‌ తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. 2011లో ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణం కారణంగా న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేయాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు. ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని