Migrants: సముద్రంలో మూడు పడవలు మాయం.. లభించని 300 మంది ఆచూకీ..!

ఆఫ్రికాలోని సెనెగల్‌ నుంచి స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు బయల్దేరిన మూడు బోట్లు కనిపించకుండా పోయాయి. వాటిలో 300కు మందికిపైగా వలసదారులు ఉన్నట్లు సమాచారం.

Published : 10 Jul 2023 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గ్రీస్‌ (Greece)లో ఇటీవల అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 80 మందికిపైగా మృతి చెందారు. దాదాపు 500 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషాదం మరువకముందే.. తాజాగా మరో మూడు పడవలు (Migrant boats) అట్లాంటిక్‌ మహాసముద్రంలో కనిపించకుండా పోవడం కలవరపరుస్తోంది. ఆ బోట్లలో దాదాపు 300 మందికిపైగా వలసజీవులు (Migrants) ఉన్నట్లు సమాచారం. ఆఫ్రికాలోని సెనెగల్‌ (Senegal) నుంచి దాదాపు 1700 కి.మీల దూరంలో ఉన్న స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల (Canary Islands)కు ఇవి బయల్దేరాయని వలసదారుల హక్కుల సంస్థ ‘వాకింగ్‌ బార్డర్స్‌’ వెల్లడించింది.

‘200 మందికిపైగా వలసదారులతో ఒక పడవ, 100 మందికిపైగా పౌరులతో మరో రెండు బోట్లు దాదాపు రెండు వారాల క్రితం కానరీ దీవులకు బయల్దేరాయి. మార్గమధ్యలో అవి తప్పిపోయాయి. వలసదారుల్లో చాలామంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. స్పెయిన్‌, సెనెగల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి’ అని వలసదారుల హక్కుల సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పెయిన్‌ అధికారులు.. కానరీ దీవుల సమీపంలో అన్వేషణ మొదలుపెట్టారు. ఈ దీవులకు కొన్నేళ్లుగా వలసదారుల తాకిడి తీవ్రంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏడు వేలమందికిపైగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా మారటేనియా, మొరాకో, పశ్చిమ సహారా, సెనెగల్‌ల నుంచి ఇక్కడికి వస్తున్నారు.

  • ఇదీ చదవండి: వలసలతో ఐరోపా విలవిల

అయితే, పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవుల ప్రయాణ మార్గం అత్యంత ప్రమాదకరమైనదని నివేదికలు చెబుతున్నాయి. అట్లాంటిక్‌ భీకర అలల ధాటికి చిన్నచిన్న పడవల వంటివి నిలవడం కష్టం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ మార్గంలో దాదాపు 800 మంది చనిపోవడమో లేదా తప్పిపోవడమో జరిగింది. గతంలో వాయువ్య ఆఫ్రికా నుంచి కానరీ దీవులకు చేరుకునే ప్రయత్నంలో దాదాపు ఏడు శరణార్థుల పడవలు.. కరేబియన్ దీవులు, బ్రెజిల్‌కు కొట్టుకుపోయాయి. అయితే.. స్థానికంగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగిత, హింస, రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పుల వంటి అనేక అంశాలు వలసదారులను తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం దాటేందుకు కారణమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని