Jaishankar: చైనాది ‘మైండ్‌ గేమ్‌’.., రష్యాది పాలనా దక్షత : ఎస్‌.జైశంకర్‌

ద్వైపాక్షిక ఫ్రేమ్‌వర్క్‌ కింద సమస్యలను తక్కువ చేసి చూపేందుకు చైనా (China) మైండ్‌గేమ్‌ ఆడుతుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్ పేర్కొన్నారు.

Published : 23 Feb 2024 18:02 IST

దిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో చైనా వైఖరిపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడం, అవి కొనసాగించడమనేది ఇరు దేశాలకు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారుతుందన్నారు. తక్షణ సమస్య మాత్రం బీజింగ్‌ (China) నిబంధనలు పాటించకపోవడమేనని..  అదే తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణకు దారితీస్తోందన్నారు.

ద్వైపాక్షిక ఫ్రేమ్‌వర్క్‌ కింద ఈ సమస్యలను తక్కువ చేసి చూపేందుకు చైనా (China) మైండ్‌గేమ్‌ ఆడుతుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్ పేర్కొన్నారు. భారత్‌ మాత్రం అంతర్జాతీయ అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తోందన్నారు. దిల్లీలో జరుగుతోన్న రైసినా డైలాగ్‌-2024లో మాట్లాడిన ఆయన.. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్‌-చైనాలు సమతుల్యతను కొనసాగిస్తాయా? అన్న ప్రశ్నకు ఈవిధంగా బదులిచ్చారు.

ఆసియా వైపు రష్యా చూపు..

రష్యా (Russia) ఎంతో పాలనా దక్షత కలిగిన శక్తిమంతమైన దేశమని, అది ఆసియా వైపు చూస్తోందని ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాటి పతనంపై మాట్లాడిన ఆయన.. బీజింగ్‌తో రష్యాకు పెరుగుతోన్న సాన్నిహిత్యంపైనా స్పందించారు. పశ్చిమ దేశాల విధానాలే ఆ రెండు దేశాలను (Russia-China) దగ్గర చేస్తున్నాయని అన్నారు.

‘అపారమైన పాలనా దక్షత కలిగిన దేశం రష్యా. అటువంటి శక్తులు ఉన్న దేశాలు ఒకే కోణంలో సంబంధాలు కొనసాగించవు. ఇది వారి విధానానికి వ్యతిరేకం’ అని జైశంకర్‌ పేర్కొన్నారు. భిన్న దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం రష్యాకు అనేక ఐచ్ఛికాలను కల్పిస్తుందని భావిస్తున్నానన్నారు. రష్యాతో కలిసి పనిచేయడం ఆసియా దేశాలకు ఎంతో ముఖ్యమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని