Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..

మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్‌ సన్నిహితుడు మహ్మద్‌ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి.

Updated : 11 Jan 2024 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌ సన్నిహితుడు మహ్మద్‌ ముయిజ్జు గెలుపొందారు. హిందూ మహాసముద్రంలో చిన్న దీవుల సమూహమైన మాల్దీవులకు భారత్‌తోనే అనుబంధం ఎక్కువ. అయితే 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్‌ గయూమ్‌ భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు.

ఇండియా ఫస్ట్‌ విధానం మారుతుందా?

మాల్దీవులు అన్ని రకాలుగా భారత్‌పై ఆధారపడుతుంది. ఆ దేశ పర్యాటకుల్లో ఎక్కువ భాగం భారతీయులే. మాల్దీవులకు చెందిన వేలాదిమంది ప్రజలు భారత్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. 1988లో శ్రీలంకకు చెందిన కొందరు ఉగ్రవాదులు మాల్దీవులపై దాడి చేయగా భారత వాయుసేన వారిని తరిమికొట్టి అప్పటి దేశాధ్యక్షుడిని రక్షించింది. అందుకనే మాల్దీవుల యంత్రాంగం ఎప్పటి నుంచో ఇండియా ఫస్ట్‌ విధానం అవలంబిస్తోంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఇబ్రహీం సోలిహ్‌ సైతం భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశారు.  ముయిజ్జు రాకతో మళ్లీ చైనా వైపు వెళ్లేందుకు మాల్దీవులు ప్రయత్నించవచ్చని భారత రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డ్రాగన్‌ ఎత్తుగడలు

భారత్‌ చుట్టూ ముత్యాల సరం పేరుతో చైనా పాక్‌లోని గ్వదర్‌, శ్రీలంకలోని హంబన్‌టోటా తదితర ప్రాంతాల్లో నౌకాశ్రయాలు ఏర్పాటు చేసింది. అత్యవసరమైతే ఇక్కడ తన నౌకాదళాన్ని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో యామీన్‌ అధికారంలో ఉన్న సమయంలో మాల్దీవులకు ఉదారంగా రుణాలిచ్చి కొన్ని దీవుల్లో  పాగా వేసేందుకు యత్నించింది. అయితే కొంత కాలం తరువాత జరిగిన ఎన్నికల్లో యామీన్‌ ఓడిపోవడంతో చైనా పన్నాగాలు ఫలించలేదు. తాజాగా మళ్లీ యామీన్‌ సన్నిహితుడు అధికారంలో రావడంతో డ్రాగన్‌ తన పన్నాగాలను అమలుచేసే అవకాశముంది. 

మాల్దీవులు ఎందుకంత కీలకం?

భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు కింద ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు చిన్న దేశం కావడంతో భారత్‌ ఎక్కువగా సాయం చేసింది. మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా భారత భద్రతపై పెను ప్రమాదం చూపించే అవకాశముంది. దీంతో  ముందుగానే మాల్దీవుల యంత్రాంగాన్ని కట్టడి చేయాలని రక్షణ రంగనిపుణులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని