Landslide: ఘోరం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి..!

Landslide: పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య వందకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

Published : 24 May 2024 12:40 IST

మెల్‌బోర్న్‌: పసిఫిక్‌ దేశం పపువా న్యూ గినియా (Papua New Guinea)లో ప్రకృతి విపత్తు సంభవించింది. మారుమూల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి (Landslide) బీభత్సం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా మరణించినట్లు ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది.

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లోని కావోకలం గ్రామంలో ఈ విపత్తు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది.

‘కూలడానికి 90 సెకన్ల ముందు’.. ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదంపై తొలి నివేదిక!

శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికి తీశామని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. కాగా.. ఈ గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని సమాచారం. మృతుల సంఖ్యపై పపువా న్యూ గినియా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు