Moscow Airports: ఉక్రెయిన్‌ డ్రోన్ల ఎఫెక్ట్‌.. మాస్కో ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిపివేత

Drone Attack: రష్యాపై ఉక్రెయిన్‌ మరోసారి డ్రోన్లను ప్రయోగించింది. మాస్కో శివారుల్లో నాలుగు డ్రోన్లను కూల్చేసినట్లు పుతిన్‌ సైన్యం వెల్లడించింది. 

Updated : 22 Aug 2023 10:38 IST

మాస్కో: ఇటీవల కాలంలో రష్యా (Russia)పై వరుసగా డ్రోన్‌ దాడులు (Drone Attack) జరుగుతున్నాయి. ఉక్రెయిన్ (Ukraine) వైపు నుంచి వస్తోన్న ఈ దాడిని పుతిన్‌ (Putin) సేనలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. తాజాగా మాస్కో సమీపంలో, సరిహద్దుల్లోని బ్రియాన్‌స్క్‌ ప్రాంతంలోకి మంగళవారం నాలుగు ఉక్రెయిన్‌ డ్రోన్లు దూసుకురాగా.. రష్యా సైన్యం వాటిని కూల్చేసింది.

ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా మాస్కోలోని నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టు (Moscow Airports)ల్లో విమానాల రాకపోకలను (Flights suspended) అధికారులు నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘వుకోవో, షెరిమెటివో, దొమోదెడొవో, జుకోవ్‌స్కీ ప్రాంతాల్లో గగనతలాన్ని మూసివేశాం. ఈ నాలుగు ఎయిర్‌పోర్టుల్లో విమానాల ల్యాండింగ్‌ను అనుమతించట్లేదు. ఇక్కడి నుంచి బయల్దేరే విమానాలు కూడా ఆలస్యం కానున్నాయి’’ అని ఓ అధికారి చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. దీంతో దాదాపు 50 విమానాల రాకపోకలపై ఈ ప్రభావం పడింది. మరోవైపు, ఉక్రెయిన్‌ జరిపిన తాజా డ్రోన్‌ దాడుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది.

మళ్లీ అధికారంలోకి వస్తే భారత ఉత్పత్తులపై అధిక పన్ను విధిస్తా

గత కొద్ది రోజులుగా రష్యా భూభాగాలను లక్ష్యంగా చేసుకుని తరచూ డ్రోన్‌ దాడులు జరుగుతున్నాయి. గత ఆదివారం కూడా ఉక్రెయిన్‌కు కెందిన ఓ డ్రోన్‌ రష్యాలోని కుర్స్క్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో రైల్వే స్టేషన్‌ పైకప్పు కూలి ఐదుగురు గాయపడ్డారు. గతవారం మాస్కోలో అధ్యక్ష భవనానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. కీవ్ ప్రయోగించిన డ్రోన్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు మాస్కో వర్గాలు తెలిపాయి. డ్రోన్ శకలాలు పడి మాస్కో ఎక్స్ పో సెంటర్ కాంప్లెక్స్ భవనం పాక్షికంగా ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి. అప్పుడు కూడా సమీపంలోని విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిపివేశారు. అయితే, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్‌ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని