Ukraine Crisis: రష్యాలో 7 లక్షల మంది ఉక్రెయిన్‌ చిన్నారులు!

ఉక్రెయిన్‌లో యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు చెందిన 7లక్షల మంది చిన్నారులను తమ ప్రాంతంలో ఉన్నట్లు రష్యా పార్లమెంటు సభ్యుడు ఒకరు వెల్లడించారు.

Published : 03 Jul 2023 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాదిన్నర కాలంగా భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా (Russia).. తమ చిన్నారులను అక్రమంగా తరలిస్తోందని ఉక్రెయిన్‌ (Ukraine) ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి వేల మంది చిన్నారులను రష్యా బలవంతంగా తీసుకెళ్లిపోతోందని అటు అమెరికా కూడా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు 7లక్షల మంది చిన్నారులను రష్యా తమ ప్రాంతంలోకి తీసుకువెళ్లినట్లు తేలింది. ఈ విషయాన్ని రష్యా పార్లమెంటు సభ్యుడు ఒకరు వెల్లడించారు.

‘ఇటీవల కాలంలో 7లక్షల మంది చిన్నారులు మా వద్ద శరణార్థులుగా ఉన్నట్లు గుర్తించాం. వీరంతా ఉక్రెయిన్‌లో బాంబు దాడుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారే’ అని రష్యా పార్లమెంటు ఎగువసభకు చెందిన గ్రిగోరి కరాసిన్‌ వెల్లడించారు. ఫెడరేషన్‌ కౌన్సిల్‌లో అంతర్జాతీయ వ్యవహారాల కమిటీకి చీఫ్‌గా ఉన్న ఆయన ఆదివారం రాత్రి ఈ వివరాలు తెలియజేశారు. అయితే, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో తల్లిదండ్రులకు దూరమైన వారితోపాటు అనాథలుగా మారుతోన్న చిన్నారులను రక్షించేందుకే తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రష్యా వెల్లడించిందని అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు పేర్కొన్నాయి.

మరోవైపు సైనిక చర్య పేరుతో 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలోనే అనేక మందిని రష్యా బలవంతంగా తమదేశం తీసుకెళ్లిందనే ఆరోపణలు వచ్చాయి. కేవలం జులై 2022లోనే 2.6లక్షల మంది చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లినట్లు అమెరికా అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని