Ukraine Crisis: మూడు రోజుల్లోనే మరోసారి.. 18 క్షిపణులతో రష్యా భీకర దాడులు!

ఇటీవలే ఉక్రెయిన్‌పై 20కిపైగా క్షిపణులను ప్రయోగించిన రష్యా.. మూడు రోజుల వ్యవధిలోనే తాజాగా 18 మిసైళ్లతో దాడికి దిగింది. ఈ దాడుల్లో ఖేర్సన్‌లో ఒకరు మృతి చెందారు. నీపర్‌పెట్రోవ్స్క్‌ ప్రాంతంలో దాదాపు 34 మంది గాయపడ్డారు.

Published : 02 May 2023 00:37 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) మళ్లీ భీకర దాడులు ప్రారంభించింది. ఇటీవలే 20కి పైగా క్షిపణులను ప్రయోగించి, 26 మందిని బలిగొన్న మాస్కో సేనలు.. మూడు రోజుల వ్యవధిలోనే తాజాగా మరోసారి విరుచుకుపడ్డాయి. దాదాపు 18 మిసైళ్లతో దాడి (Missile Attack)కి దిగాయి. అయితే, వాటిలో 15 క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో నేలకూల్చినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన ఆయుధాలతో ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించిన వేళ.. ఈ దాడులు జరుగుతున్నాయి.

తాజా దాడుల్లో ఖేర్సన్‌లో ఒకరు మృతి చెందారు. నీపర్‌పెట్రోవ్స్క్‌ ప్రాంతంలో దాదాపు 34 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులూ ఉన్నారు. విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. క్రమటోర్స్క్‌, పావ్లోహ్రద్ తదితర ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టం సంభవించింది. ఆయుధ కేంద్రాలు, ఇంధన డిపోలే లక్ష్యంగా చేపట్టిన ఈ దాడుల్లో భాగంగా.. అన్ని నిర్దేశిత లక్ష్యాలు ఛేదించినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.

పట్టాలు తప్పిన రష్యా రైలు

మరోవైపు.. రష్యాలో ఉక్రెయిన్ సరిహద్దుకు చేరువలోని ప్రాంతంలో సోమవారం సంభవించిన భారీ పేలుడు కారణంగా ఓ సరకు రవాణా రైలు పట్టాలు తప్పింది. స్థానిక గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. బ్రియాన్స్క్‌- ఉనేచా మార్గంలో పట్టాలపై ఈ పేలుడు పదార్థాన్ని అమర్చినట్లు గుర్తించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని