Maldives: మాల్దీవుల్లో భారత సైనికులు.. ‘మయిజ్జువి అన్నీ అబద్ధాలే’

Maldives: మాల్దీవుల్లో వేలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మయిజ్జు చేసిన వ్యాఖ్యలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు.

Published : 26 Feb 2024 07:56 IST

మాలే: మాల్దీవుల్లో (Maldives) వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే మయిజ్జు (Mohamed Muizzu) ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారని.. అందులో ఇదొకటని విరచుకుపడ్డారు.

గతంలో అధికారంలో ఉన్న ‘మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (MDP)’ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేశారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ తెలిపింది. కానీ, ఇండియాతో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని తాజాగా అబ్దుల్లా షాహిద్ అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మయిజ్జు పదే పదే అబద్ధాలు వల్లెవేస్తున్నారని చెప్పారు.

చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్‌ మయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్, మాల్దీవుల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి వైదొలుగుతాయని ముయిజ్జు ఇటీవల వెల్లడించారు. భారత్‌కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని