Sydney: సిడ్నీ మాల్‌లో కలకలం.. కత్తితో విచక్షణారహితంగా దాడి

ఆస్ట్రేలియా(Australia)లోని షాపింగ్‌ మాల్‌లో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Updated : 13 Apr 2024 16:35 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు అక్కడివారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కాల్పులు జరపడంతో అతడు హతమైనట్లు వెల్లడించారు.

మొత్తం 9 మందిపై దుండగుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మాల్‌లో ఉన్న వారిని సిబ్బంది వెంటనే అక్కడి నుంచి తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అటువైపుగా ఎవరూ రావొద్దని హెచ్చరించిన పోలీసులు దాన్ని నలువైపులా చుట్టుముట్టి హంతకుడిని మట్టుబెట్టారు. ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్‌లో తిరగడం కొన్ని మీడియా దృశ్యాల్లో కనిపించింది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి రక్తస్రావాన్ని ఆపేందుకు దుకాణంలోని దుస్తుల్ని ఉపయోగించినట్లు చెప్పారు. దుండగుడు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డాడో తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని