Elon Musk: ‘ఈ రోజు భారీ నష్టం వాటిల్లింది’: మస్క్ దేని గురించి అన్నారంటే..?

ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు. తాజాగా ఆయన ఓ అంశంపై స్పందించారు. 

Published : 31 May 2024 18:13 IST

వాషింగ్టన్‌: మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) దోషిగా తేలిన సంగతి తెలిసిందే. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. ఈ రోజు భారీ నష్టం వాటిల్లిందంటూ ట్రంప్‌నకు మద్దతుగా వచ్చారు.

‘‘అమెరికా న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ రోజు పెద్దనష్టం వాటిల్లింది. న్యాయాన్ని పక్కనబెట్టి రాజకీయ ఒత్తిళ్లతో ఒక మాజీ అధ్యక్షుడిని ఇలాంటి పనికిమాలిన కేసులో దోషిగా తేలిస్తే.. అప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటీ? వారికీ ఇలాంటి గతే పట్టదా?’’ అని మస్క్ ఆందోళన వ్యక్తంచేశారు. డెమోక్రాటిక్‌ పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తంచేసే మస్క్‌.. అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలను పలుమార్లు తప్పుపట్టారు. అదే సమయంలో ట్రంప్‌నకు దగ్గరవుతూ వస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. అడ్వైజర్‌ హోదాలో మస్క్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని ట్రంప్‌ నిర్ణయించారని వార్తలు వచ్చాయి. పలు అంశాల్లో వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడికి మస్క్ మద్దతుగా వచ్చారు. 

శృంగార తార కేసులో దోషిగా తేలిన ట్రంప్‌

ఇక, జులై 11న ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. తాజా తీర్పుతో ఆయన (Trump) అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయనిపుణులు తెలిపారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదని వెల్లడించారు. ఇక ఈ తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీల్‌ చేసుకునే వీలుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని