Palestine: పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం

ఇజ్రాయెల్‌కు మరో ఎదురుదెబ్బ. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్లు బుధవారం మూడు ఐరోపా దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

Updated : 23 May 2024 05:59 IST

నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ ప్రకటన
మండిపడిన ఇజ్రాయెల్‌
స్వాగతించిన పాలస్తీనా అథారిటీ, హమాస్‌

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌కు మరో ఎదురుదెబ్బ. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్లు బుధవారం మూడు ఐరోపా దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ద్విదేశ పరిష్కారం..ఇజ్రాయెల్‌కు మేలు చేస్తుందని నార్వే ప్రధాని యూనస్‌ గాస్కురా పేర్కొన్నారు. పాలస్తీనాకు తాము ఇచ్చిన గుర్తింపు ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ‘‘గాజా యుద్ధం కారణంగా వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న, గాయాల పాలవుతున్న ఈ దశలో ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం.. రెండు దేశాలుగా పక్కపక్కన మనుగడ సాగించడమే’’ అని గాస్కురా తెలిపారు. ‘‘ఈ గుర్తింపు.. ఇజ్రాయెల్‌ ప్రజలకు వ్యతిరేకం కాదు. శాంతి, న్యాయానికి అనుకూలం’’ అని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఆ దేశ పార్లమెంటులో పేర్కొన్నారు. గాజాలో యుద్ధనేరాలకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి గలాంట్‌ పాల్పడుతున్నారని, వారికి వ్యతిరేకంగా అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ అభ్యర్థించిన నేపథ్యంలో పాలస్తీనాను గుర్తిస్తూ ఈ మూడు దేశాలు ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐర్లాండ్, నార్వేల్లోని తమ రాయబారులను వెనక్కి రప్పించింది. తమ దేశంలోని ఆ దేశ రాయబారులకు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడికి బహుమతి ఇదా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. హత్యలు, అత్యాచారాలు చేసిన హమాస్‌కు బంగారుపతకం ప్రదానం చేసిన ఈ మూడు దేశాలను చరిత్ర మరిచిపోదంటూ ఇజ్రాయెల్‌ విదేశాంగమంత్రి కాట్జ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాల్పుల విరమణ, బందీల కోసం జరుగుతున్న చర్చలపై ఈ ప్రకటన ప్రభావం చూపిస్తుందని అన్నారు. గుర్తింపు నిర్ణయాన్ని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో పాటు హమాస్‌ స్వాగతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని