Israel: అందుకే హమాస్‌తో సంధి చర్చలు నిలిపివేశాం: నెతన్యాహు

Israel: హమాస్‌తో ప్రారంభించిన సంధి చర్చల్లో పురోగతి లేకపోవడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందించారు.

Updated : 18 Feb 2024 10:44 IST

టెల్‌ అవీవ్‌: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ విజ్ఞప్తి మేరకు సంధి చర్చల (Truce talks) కోసం అంగీకరించిన ఇజ్రాయెల్‌.. అందుకోసం ప్రతినిధులను కైరోకు పంపింది. కానీ, ఒక దఫా సమావేశానికి హాజరైన వారు తిరిగి వెళ్లలేదు. దీంతో గత మంగళవారం నుంచి చర్చలు స్తంభించిపోయాయి. దీనిపై తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) స్పందించారు. హమాస్‌ నుంచి అసంబద్ధ డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అందుకే చర్చలకు తిరిగి వెళ్లలేదని చెప్పారు.

గాజాలో కాల్పుల విరమణతో పాటు 100 మంది ఇజ్రాయెలీలను విడిపించటమే లక్ష్యంగా ఈజిప్టు, ఖతర్‌ సంధి చర్చలకు మధ్యవర్తిత్వం వహించాయి. కానీ, ఇజ్రాయెల్ మరోమారు చర్చలకు వెళ్లకపోవటంతో మంగళవారం నుంచి అవి నిలిచిపోయాయి. ‘‘యుద్ధం ఆపేసి గాజాను హమాస్‌కు అప్పగించి వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వందలాది హంతకులకు విడిచిపెట్టాలంటున్నారు. అలాగే జెరూసలెంలో వివాదాస్పదంగా ఉన్న పవిత్ర స్థలంపైనా అసంబద్ధ డిమాండ్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు కైరోలో హమాస్‌ చెప్పేదంతా విన్నారు. ఏమైనా మార్పు వస్తుందేమోనని వేచి చూశారు. కానీ, అది జరగడం లేదు. వారి డిమాండ్లలో మార్పు కనిపించే వరకు మేం తిరిగి చర్చలకు వెళ్లబోం’’ అని నెతన్యాహు (Benjamin Netanyahu) స్పష్టం చేశారు.

ఏకపక్షంగా పాలస్తీనా స్వతంత్ర హోదాను గుర్తించే ప్రతిపాదనపై నెతన్యాహు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ అలా చేస్తే ఉగ్రవాదమే దానికి ప్రతిఫలంగా లభిస్తుందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా గుర్తింపు అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగినా.. ఎలాంటి షరతులు లేకుండా ఇరు పక్షాల మధ్య చర్చలతోనే సాధ్యపడాలన్నారు.

మరోవైపు సంధి చర్చలు నిలిచిపోవడానికి ఇజ్రాయెలే కారణమని హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే ఆరోపించారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ ఉపసంహరణ, పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని