Trump: ట్రంప్‌ ఆస్తుల స్వాధీనానికి చర్యలు..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు న్యూయార్క్ అధికారులు చర్యలు చేపట్టారు. రెండు ఆస్తులను సీజ్‌ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.   

Updated : 22 Mar 2024 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ చర్యలు మొదలుపెట్టారు. ఓ మోసం కేసులో 355 మిలియన్‌ డాలర్లు, దానిపై వడ్డీని చెల్లించాలని ఆయన్ను, ఆయన కుమారులు జూనియర్‌ ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ను న్యూయార్క్‌ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ మొత్తం 454 మిలియన్‌ డాలర్లకు చేరింది. చెల్లింపుల కోసం ట్రంప్‌ ఇప్పటి వరకు ఎలాంటి యత్నం చేయకపోవడంతో అటార్నీ జనరల్‌ తదుపరి చర్యలు చేపట్టారు. ఉత్తర మాన్‌హట్టన్‌లోని ఆయన ప్రైవేటు ఎస్టేట్‌ సెవన్‌ స్ప్రింగ్స్‌, గోల్ఫ్‌ కోర్సు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. 

ఆస్తుల విలువపై ఏళ్ల తరబడి అసత్యాలు చెప్పి బ్యాంకులు, బీమా కంపెనీలను మోసం చేశారని న్యూయార్క్‌ న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు ఓడిపోతే కచ్చితంగా అపరాధ రుసుం చెల్లించేలా గ్యారెంటీ మొత్తాన్ని ఇచ్చి తీరాలని వెల్లడించింది. మరోవైపు ఇది రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్‌ అంటున్నారు.

సెవన్‌ స్ప్రింగ్స్‌ ఎస్టేట్‌ దాదాపు 230 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1919లో నిర్మించారు. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 7.5 మిలియన్‌ డాలర్లుకు 1996లో కొనుగోలు చేసింది. దీనిని సమూలంగా మార్చాలని ట్రంప్‌ భావించినా ఆ ప్రణాళిక అమలు కాలేదు. ఆయన కుటుంబం తరచూ ఈ ఎస్టేట్‌కు వచ్చివెళుతుంటుంది. ఆయన గోల్ఫ్‌ కోర్స్‌లో 75,000 చదరపుటడుగుల క్లబ్‌ హౌస్‌ ఉంది. దీనిని 1922లో ఏర్పాటు చేశారు.  

ఇప్పటికే పలు కేసుల్లో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌కు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని మాన్‌హటన్‌ ఫెడరల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అంతకుముందు ఆయనకు 5 మిలియన్‌ డాలర్ల జరిమానా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు