New Zealand: ఆధారాలు ఎక్కడ..? నిజ్జర్‌ హత్యపై ‘కెనడా’కు మిత్రదేశం ప్రశ్న!

హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య కేసులో భారత్‌ హస్తం ఉండొచ్చంటూ జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తం చేసిన న్యూజిలాండ్‌.. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడని ప్రశ్నించింది.

Published : 13 Mar 2024 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న వేళ న్యూజిలాండ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య కేసులో భారత్‌ హస్తం ఉండొచ్చంటూ జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తంచేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడని మిత్రదేశం కెనడాను ప్రశ్నించింది. ‘ఫైవ్‌ ఐస్ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ (Intelligence Alliance)’లో భాగమైనప్పటికీ ట్రూడో ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాలను పంచుకోలేదని స్పష్టం చేసింది.

న్యూజిలాండ్‌ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న విన్‌స్టన్‌ పీటర్స్‌.. నాలుగు రోజుల భారత్‌ పర్యటనలో ఉన్నారు. ఇందులోభాగంగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజ్జర్‌ హత్య కేసు గురించి మాట్లాడారు. నిజ్జర్‌ కేసును గత ప్రభుత్వం (న్యూజిలాండ్‌) చూసుకుందన్నారు. ఫైవ్‌ ఐస్‌లో భాగంగా సమాచార మార్పిడి జరిగినప్పటికీ.. ఒక్కోసారి అది అస్పష్టంగా ఉంటుందన్నారు. నిజ్జర్‌ కేసులో భారత్‌ ప్రమేయం ఉన్నట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి కచ్చితమైన సాక్ష్యాలు మాత్రం ఒక్కటి కూడా కనిపించలేదన్నారు.

నిఘా సమాచార మార్పిడి కోసం ఏర్పాటైన ఫైవ్‌ ఐస్‌ (Five Eyes) కూటమిలో కెనడా, న్యూజిలాండ్‌లతోపాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే, నిజ్జర్‌ విషయంలో కెనడా వాదనను ఈ కూటమిలో ఉన్న దేశం ప్రశ్నించడం ఇదే తొలిసారి. కెనడా చేసిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తంచేసిన న్యూజిలాండ్‌ ఉప ప్రధానిపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరింపులకు దిగడం గమనార్హం.

ఇదిలాఉంటే, నిజ్జర్‌ హత్య వెనక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన ట్రూడో ప్రభుత్వం.. విచారణలో భారత్‌ ‘సహాయ నిరాకరణ’ చేస్తోందని ఆరోపించింది. వీటిని ఖండించిన భారత్‌.. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే.. పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మరోసారి స్పందించిన కెనడా.. విచారణకు భారత్‌ సహకరిస్తోందని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని