Ukraine: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో ఉక్రెయిన్‌పై ఎవరూ దృష్టి పెట్టట్లేదు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌పై దృష్టిని ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మరల్చిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తాము చేస్తోన్న యుద్ధంలో స్తబ్దత ఏమీ లేదని స్పష్టం చేశారు. 

Updated : 05 Nov 2023 00:11 IST

కీవ్‌: ప్రస్తుతం ప్రపంచమంతటా ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas Conflict) యుద్ధంపైనే చర్చ జరుగుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతోన్న ఉక్రెయిన్‌, రష్యా వివాదం (Ukraine-Russia) కనుమరుగవుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky ) ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధంలో ప్రతిష్టంభన లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి యుద్ధంలో ఎలాంటి కదలిక లేదని వెల్లడించిన నేపథ్యంలో జెలెన్‌స్కీ దీనిపై స్పందించారు. 

యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ (EU Commission) చీఫ్‌ ఉర్సులా వాన్‌ డర్‌ లెయెన్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. ‘‘కాలం గడిచిపోయింది.. ప్రజలు అలసిపోయారు. అంతేగానీ, యుద్ధం ఆగిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది’’అని స్పష్టం చేశారు. రష్యాతో సంప్రదింపులు జరిపి సంధి చేసుకోవాలని పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెస్తున్నాయన్న వార్తల్ని జెలెన్‌స్కీ ఖండించారు. ఎవరూ తమపై ఒత్తిడి చేయట్లేదన్నారు. ఉక్రెయిన్‌పై ప్రపంచదేశాల దృష్టిని ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం మరల్చిందని, దీంతో తమ దేశంపై ఎవరూ దృష్టి పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా లక్ష్యం కూడా అదేనని ఆరోపించారు. ఇప్పటికే తాము ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామని.. వాటిని అధిగమిస్తామన్న నమ్మకం తనకుందని జెలెన్‌స్కీ ధీమా వ్యక్తం చేశారు.

ఈ దాడులేంటి..వివరణ ఇవ్వండి: ఇజ్రాయెల్‌ను అడిగిన అమెరికా

రష్యాతో యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఈయూ కమిషన్‌ ముందుకొచ్చింది. 2027 వరకు మరో 54 బిలియన్‌ డాలర్లు సాయాన్ని ప్రతిపాదించింది. హంగేరీ, స్లొవేకియా మినహా యూరోపియన్‌ యూనియన్‌లోని దాదాపు అన్ని దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నాయి. మరోవైపు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు చాలాకాలంగా అండగా నిలుస్తోంది. యుద్ధ ఫలితం వచ్చే వరకు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంతోపాటు ఆయుధాలనూ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని