North Korea: ఉపగ్రహ ప్రయోగ వైఫల్యం.. ఓ పెద్ద లోపం: ఉత్తరకొరియా

అతి త్వరలోనే మరో నిఘా ఉపగ్రహం ప్రయోగిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. దీంతోపాటు శక్తిమంతమైన అణ్వాయుధాల తయారీని వేగవంతం చేయాలని కిమ్‌ నేతృత్వంలోని ఆ దేశ పాలకులు నిర్ణయించారు. 

Updated : 19 Jun 2023 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ తొలి ఉపగ్రహ ప్రయోగ వైఫల్యం ఓ పెద్ద లోపమని ఉత్తరకొరియా(North Korea) కీలక అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే మరో సారి ప్రయోగం చేపడతామని వారు వెల్లడించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని వర్కర్స్‌పార్టీ పార్టీ మూడు రోజులపాటు నిర్వహించిన సమావేశం ఆదివారం ముగిసింది. శక్తిమంతమైన అణ్వాయుధాల తయారీని మరింత వేగవంతం చేస్తామని కిమ్‌జోంగ్‌ ఉన్‌(Kim Jong Un), ఆయన సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు. 

అమెరికా, దక్షిణ కొరియా దళాల కదలికలను గుర్తించేందుకు త్వరగా అంతరిక్ష టెక్నాలజీపై పట్టు సాధించాలన్న కిమ్‌(Kim Jong Un) ఆశయానికి ఈ వైఫల్యం ఎదురుదెబ్బగా భావించింది. దీంతోపాటు  దేశంలోని సాంకేతికత ఆధునికీకరణ వంటి అంశాలపై పార్టీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. 

ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అధికారులను ఈ సమావేశంలో కొరియన్‌ వర్కర్స్‌ పార్టీ నిందించింది. ఈ వైఫల్యాల నుంచి వీలైనంత త్వరగా నేర్చుకొని అతి వేగంగా మరో ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టాలని వారికి టార్గెట్‌ నిర్ణయించారు. కానీ, ఈ ప్రయోగాన్ని ఎప్పటి లోగా నిర్వహించాలనే అంశం మాత్రం వెల్లడించలేదు. మరో వైపు దక్షిణ కొరియా నిఘా బృందాలు మాత్రం ఈ ప్రయోగ వైఫల్యానికి కారణాలు కనుగొనేందుకే ప్యాంగ్యాంగ్‌కు కొన్ని వారాల సమయం పట్టవచ్చని పేర్కొంటోంది. ఈ వైఫల్యానికి ఎవరిని బాధ్యులను చేసిందో మాత్రం వర్కర్స్‌ పార్టీ వెల్లడించలేదు. 

వర్కర్స్‌పార్టీ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం సందర్భంగా శత్రుదేశాలైన దక్షిణ కొరియా, అమెరికా తీరు వల్ల ఈ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపై సమీక్షించారు. దీంతోపాటు అమెరికా వ్యతిరేక దేశాలకు సంఘీభావంగా పనిచేయాలని నిర్ణయించారు. 2022 నుంచి ఉత్తర కొరియా దాదాపు 100 క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిల్లో కొన్ని నిఘా ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించినవి కూడా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని