North Korea: ఇది కిమ్ పంచుతోన్న అమృతం..!

కరోనా కేసు ఒక్కటీ లేదని రెండేళ్లు గర్వంగా చెప్పుకున్న ఉత్తర కొరియా.. ఇప్పుడు వైరస్ ఉద్ధృతితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Published : 31 May 2022 15:30 IST

వ్యాక్సినేషన్‌ను ప్రచారాస్త్రంగా మార్చుకున్న ఉ.కొరియా నియంత

ప్యాంగ్యాంగ్: కరోనా కేసు ఒక్కటీ లేదని రెండేళ్లు గర్వంగా చెప్పుకొన్న ఉత్తర కొరియా.. ఇప్పుడు వైరస్ ఉద్ధృతితో ఉక్కిరిబిక్కిరవుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ, పలు దేశాలు కొవిడ్ టీకాలు ఇస్తామంటే అంగీకరించని ఆ దేశం.. ఇప్పుడు కాస్త మెట్టు దిగింది. చివరకు ఇటీవల ప్రజలకు టీకాలు అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. టీకా కేంద్రాలను తన ప్రభను పెంచుకునే వేదికలుగా మార్చుకున్నారు. ఈ టీకా ప్రేమతో కూడిన అమృతమని, దీనిని కిమ్ బహుమతిగా ఇచ్చారంటూ ఊదరగొడుతున్నారు అక్కడి అధికారులు. డెయిలీ స్టార్ అనే వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

తాజా ఉద్ధృతిని అడ్డుకునేందుకు ఉత్తర కొరియా.. చైనా నుంచి టీకాలు పొందుతోంది. అయితే ప్రస్తుతం అవి అందరికీ అందుబాటులో లేవు. దేశ నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న సైనికులకు మాత్రమే వీటిని అందిస్తున్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల వద్ద ప్రభుత్వం లౌడ్ స్పీకర్లు పెట్టి.. కిమ్‌ ఘనతను చాటుతోంది. ఈ వ్యాక్సినేషన్ అత్యున్నత వ్యక్తి నుంచి అందిన దయగల బహుమతి అని, ఇది కిమ్ ఇస్తోన్న ‘ప్రేమతో కూడిన అమృతం’ అని స్పీకర్లు వాయించుతున్నాయి.

రెండేళ్లుగా కరోనా వైరస్‌తో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. గత నెల వరకు తమ దగ్గర ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిమ్ ప్రభుత్వం తెలిపింది. కొద్దివారాల క్రితం మొదటి కేసును ధ్రువీకరించింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించింది. కొవిడ్ ప్రకటన అయితే చేసింది కానీ.. రోజువారీ గణాంకాల్లో మాత్రం దేశ ప్రజలు మిస్టరీ జ్వరాల బారినపడుతున్నట్లు చెప్తోంది. కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయి 3.9లక్షల మంది ఆ జ్వరం బారినపడ్డారు. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు తగ్గింది. దాంతో రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను సడలించింది. ఇక ఇప్పటివరకూ 70 మరణాలు వచ్చినట్లు తెలిపింది. కాగా, అరకొర సదుపాయాలున్న ఈ పేద దేశం వెల్లడిస్తోన్న లెక్కలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు