North Korea: దక్షిణ కొరియా ద్వీపం దిశగా కిమ్‌ సైన్యం కాల్పులు..!

ఉత్తరకొరియా భారీ కవ్వింపు చర్యకు పాల్పడింది. ఏకంగా దక్షిణ కొరియాకు చెందిన ద్వీపం దిశగా వందల సంఖ్యలో శతఘ్ని గుండ్లను పేల్చింది.

Updated : 05 Jan 2024 17:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా (North Korea) భారీ కవ్వింపు చర్యకు పాల్పడింది. ఈ సారి ఏకంగా దక్షిణ కొరియా ద్వీపమైన యొన్పియోంగ్‌పై వందల సంఖ్యలో శతఘ్ని గుండ్లను పేల్చింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఆ ద్వీపంలోని ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశాయి.

ఇరాన్‌లో జంట పేలుళ్లు మా పనే.. ఉగ్రసంస్థ ఐఎస్‌ ప్రకటన

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఉత్తర కొరియా దాదాపు 200 శతఘ్ని గుండ్లను ఈ ద్వీపం దిశగా పేల్చింది. కాకపోతే.. అవి దక్షిణ కొరియా భూభాగానికి చేరలేదు. మధ్యలోనే సముద్రంలోని బఫర్‌ జోన్‌లో పడిపోయాయి. దీనిపై దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమ దేశ పౌరులు, సైనిక సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదన్నారు. ఉత్తర కొరియా చర్యలు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతకు ముప్పుగా మారాయన్నారు. 2010లో ఉత్తరకొరియా ఈ ద్వీపంపై జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అంతేకాదు రెండేళ్లుగా క్షిపణి పరీక్షలు చేస్తూ సియోల్‌ను కవ్విస్తోంది. వీటిల్లో కొన్నింటి శకలాలు ద.కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి.

అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవలే సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి ద.కొరియాతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తేల్చేశారు. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని ఆయన సూచించారు. వాషింగ్టన్‌, సియోల్‌ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే.. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే కిమ్‌ చిన్న కుమార్తే తదుపరి వారసురాలిగా నియమితులయ్యే అవకాశముందని దక్షిణ కొరియా నిఘా సంస్థ గురువారం వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని