North Korea: ద.కొరియా అధ్యక్షుడి సిబ్బంది ఈమెయిల్‌ ఖాతా హ్యాక్‌ చేసిన ఉ.కొరియా..!

దక్షిణ కొరియా అధ్యక్ష బృందంలోని ఓ కీలక వ్యక్తి ఈమెయిల్స్‌ ఉత్తర కొరియా హ్యాక్‌ చేసింది. చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించారు.    

Published : 14 Feb 2024 16:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్‌ సుక్‌ యోల్‌ సన్నిహిత సిబ్బందిలో ఒకరి ఈమెయిల్‌ ఖాతాను ఉత్తర కొరియా హ్యాక్‌ చేసింది. గతేడాది నవంబర్‌లో యోల్‌ యూకే పర్యటన నాటి వరకు దీని నుంచి సమాచారం చౌర్యం కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని సియోల్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. సదరు సిబ్బంది వ్యక్తిగత ఈమెయిల్‌ను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించాడని వెల్లడించారు. అధ్యక్షుడి పర్యటన వివరాలు మొత్తం ముందుగానే హ్యాకర్లకు చేరినట్లు వెల్లడించారు.

స్థానిక పత్రికలు మాత్రం అధ్యక్షుడు యోల్‌  పంపించిన రహస్య సందేశాల వివరాలు కూడా హ్యాకర్లు తస్కరించినట్లు చెబుతున్నాయి. కానీ, ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించలేదు. ఉ.కొరియా సైబర్‌ బృందాలు తొలిసారి ద.కొరియా అధ్యక్ష బృందంలోని కీలక వ్యక్తి వివరాలను దక్కించుకోగలిగాయి. మరోవైపు దీనిపై యోల్‌ కార్యాలయం స్పందించింది. అధ్యక్ష కార్యాలయ భద్రతా వ్యవస్థ బాగానే పనిచేస్తోందని పేర్కొంది. ‘‘నియమాలను పాటించడంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకొంది. సదరు వ్యక్తి అధికారిక కార్యకలాపాలకు కమర్షియల్‌ ఈమెయిల్‌ను వాడాడు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

అమెరికాలో కేబినెట్‌ సభ్యుడిపై అభిశంసన.. 150 ఏళ్లలో తొలిసారి

ఉత్తర కొరియా వద్ద శక్తిమంతమైన సైబర్‌ బృందాలున్నాయి. ఆంక్షల కారణంగా ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యం రాక చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఇక్కడి హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. ఈ బృందాలు 2016లో ఏకంగా 3 బిలియన్‌ డాలర్లను చోరీ చేశాయి. ఈ హ్యాకర్లను వాడి ఆయుధ రహస్యాలను కూడా ఉత్తరకొరియా చోరీ చేస్తుంది.  తాజాగా హ్యాక్‌ కారణంగా తమ దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ద.కొరియా అధికారులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని